
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి కేటీఆర్‌కు కోవర్టుగా వ్యవహరిస్తున్నారని, ఆ విషయం గాంధీ భవన్‌లో అందరికీ తెలుసని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్ల, చిద్రుప్ప గ్రామాల్లో సోమవారం నిర్వహించిన సభల్లో ఆమె మాట్లాడారు. వైఎస్సార్ ఎప్పుడు పార్టీ మారారో చెప్పాలని జగ్గారెడ్డిని డిమాండ్ చేశారు.
ఆయనలా పార్టీలు మారే సంస్కృతి వైఎస్సార్‌కు లేదని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో రెండుసార్లు కాంగ్రెస్ విజయంలో వైఎస్సార్ కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఆయనను పార్టీ గౌరవించడం లేదన్నారు. పాదయాత్ర 2,300 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఆరుట్లలో వైఎస్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు.
ఇదిలా ఉంటే.. షర్మిల వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. పాదయాత్రలో భాగంగా జగ్గారెడ్డిపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రోజుకో పార్టీ మారుతూ, జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని జగ్గారెడ్డిపై షర్మిల మండిపడ్డారు. ఈ నేపథ్యంలో షర్మిలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే షర్మిల ఎత్తుగడ అన్నారు. నాడు పాదయాత్ర చేస్తూ జగన్ వదిలిన బాణంగా షర్మిల చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఇక్కడ దస్తి వేసి వైఎస్ వదిలిన బాణం అని చెబుతోందని జగ్గారెడ్డి విమర్శించారు. జగన్, బీజేపీ వదిలిన బాణం షర్మిల అని జగ్గారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ ప్రజల ఓటును చీల్చడమే షర్మిల ఉద్దేశమన్నారు. ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా దర్శకత్వంలో షర్మిల పని చేస్తున్నారన్నారు. ఆంధ్రా ప్రాంత ఓటు బ్యాంక్‌ను చీల్చితే బీజేపీకి ఉపయోగపడుతుందనే ఎత్తుగడతో వైఎస్ విజయమ్మ సహా జగన్, షర్మిల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.