
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం అయింది. ఉదయం 11 గంటలకు ఢిల్లీలో జరిగిన సమావేశానికి ఏపీ సీఎస్ సమీర్‌శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న 7అంశాలతో పాటు ఏపీకి సంబంధించిన మరో 7 అంశాలపై చర్చ జరిగింది. ఇరు రాష్ట్రాలకు సంబంధించి విభజనచట్టంలోని షెడ్యూల్ 9,10లోని ఆస్తుల పంపకాలపై చర్చించారు. ఇక విభజన జరిగి 8 ఏళ్లు అవుతున్నా పలు కంపెనీలు, కార్పొరేషన్లు, రాష్ట్ర సంస్థల్లో ఇంకా విభజన పూర్తిస్థాయిలో కాలేదు.
కొన్ని సంస్థల్లో ఉద్యోగుల విభజన జరిగినప్పటికీ..ఆస్తుల విభజన మాత్రం ఇంకా పూర్తికాలేదు. ఇవన్నీ చర్చకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న సింగరేణి కాలరీస్‌లో తమకూ వాటా కావాలని ఏపీ సర్కార్ అడుగుతోంది. దీంతో పాటు ఏపీ హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ కూడా ఇంకా విభజన పూర్తి కాలేదు. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి వచ్చిన నిధులు కూడా రెండు రాష్ట్రాలకు పంపకాలు జరగాల్సి ఉంది. విభజన జరిగిన ఏడాది బియ్యం సరఫరా చేసినందుకు తెలంగాణ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ నుంచి ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌కు బకాయిలు రావల్సి ఉంది. ఈ ఏడు అంశాలు కూడా ఆర్థికపరమైన ఇబ్బందులతో కూడుకున్నవే కావడంతో వీటి విభజన ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. మరోవైపు ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లింపు విషయం ఏజెండాలో లేనప్పటికీ మీటింగ్‌లో ప్రస్తావించాలని భావిస్తోంది ఏపీ సర్కార్.
ఇక ఏపీకి సంబంధించి ఎజెండాలో పెట్టిన 7 అంశాల్లో రాజధాని అంశం కూడా ఒకటి. ఇప్పటివరకూ రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఎంత ఇచ్చింది..? ఇంకా ఎంత అవసరం అనే దానిపై చర్చ జరగనుంది. ప్రస్తుతం ఏపీ సర్కార్ 3 రాజధానులు అని చెబుతుండటంతో దీనిపై కేంద్రం ఏం క్లారిటీ ఇస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. అటు విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇవ్వాల్సిన పన్ను రాయితీలు, రెవెన్యూ లోటు ప్రకారం రావల్సిన నిధులు కూడా పూర్తిస్థాయిలో అందలేదు. 7 వెనుకబడిన జిల్లాలకు ఏటా ఇచ్చే 350 కోట్లు కూడా రెండేళ్లు మాత్రమే ఇచ్చింది కేంద్రం. కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు,కొత్త రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ కనెక్టవిటీ మీద కూడా కేంద్ర హోంశాఖ చర్చించింది.