
బొమ్మరిల్లు భాస్కర్.. తన మొదటి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. తొలి చిత్రం అంత పెద్ద సక్సెస్ సాధించింది మరి. దాని తర్వాత వచ్చిన పరుగు కూడా డీసెంట్ గానే ఆడినా ఆ తర్వాత ఆరెంజ్, ఒంగోలు గిత్త లు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఇక తమిళంకు వెళ్లి అక్కడ ఒక రీమేక్ ట్రై చేసినా అది కూడా ప్లాప్ అయింది. ఇక సినిమాలు లేక ఖాళీగా ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ కు పిలిచి అవకాశమిచ్చింది గీతా ఆర్ట్స్ సంస్థ.
అఖిల్ అక్కినేని నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమా అవకాశాన్ని చేతిలో పెట్టింది. ఈ ప్రాజెక్ట్ కు తనదైన శైలిలో కథ రాసుకుని షూట్ చేసిన భాస్కర్, ఆ తర్వాత చాలా సీన్లను రీషూట్ చేయాల్సి వచ్చిందట. గీతా ఆర్ట్స్ హెడ్ మ్యానేజ్మెంట్ తో పాటు నాగార్జున కూడా క్రియేటివ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యారు. సినిమా పూర్తైన తర్వాత చాలానే మార్పులు చేర్పులు చేసారు. ఎలాగైతేనేం మొత్తానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ హిట్ సాధించింది.
బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన మార్పులు చేర్పులకు ఓపిగ్గా పనిచేయడంతో గీతా ఆర్ట్స్ సంస్థ కూడా మెచ్చింది. సంస్థకు హిట్ అందడంతో భాస్కర్ కు మరో అవకాశం ఇచ్చింది. మరో యూత్ ఫుల్ స్టోరీతో రమ్మని, ఒక యువ హీరోతో సినిమా చేద్దామని భాస్కర్ కు ఆఫర్ ఇచ్చిందిట. మరి ఈసారి ఎలాంటి పాయింట్ తో వస్తాడో చూడాలి.