
తెలుగు టెలివిజన్ రంగంలో మోస్ట్ సక్సెస్ఫుల్ షో జబర్దస్త్ లో చీలికలు మొదలైన విషయం కొద్ది రోజుల క్రితమే బయటకు వచ్చిన సంగతి తెల్సిందే. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ నుండి జడ్జిగా ఉంటోన్న నాగబాబు ఈ షో నుండి బయటకు వచ్చేసాడు. అంతకంటే ముందు జబర్దస్త్ షో రూపకర్తల్లో ముఖ్యులు నిఖిల్ అండ్ కో బయటకు వచ్చినప్పుడే జబర్దస్త్ షో కి ఇబ్బందులు మొదలైనట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు దానికి తగ్గట్లుగానే పరిణామాలు జరుగుతున్నాయి. జబర్దస్త్ కు పోటీగా జీ తెలుగులో ఒక షో మొదలవుతుందని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. నిఖిల్ అండ్ కో, జీ తెలుగుతో ఇప్పటికే ఆ షో ఎలా ఉంటుంది తదితర అంశాలన్నీ డిస్కస్ చేసి ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది. జడ్జిగా నాగబాబు వ్యవహరిస్తారు. నాగబాబుతో పాటుగా చమ్మక్ చంద్ర కూడా బయటకు వచ్చేసాడు. ఈ విషయాన్ని అధికారికంగా చమ్మక్ చంద్ర ప్రకటించాడు.
అయితే అసలు విషయం చెప్పకుండా ఒక మూడు, నాలుగు నెలలు షో నుండి బ్రేక్ తీసుకుంటున్నట్లు, ఆ ప్రెజర్ కు దూరంగా ఉండనున్నట్లు తెలిపాడు. తర్వాత జబర్దస్త్ కు వచ్చే అవకాశాలున్నాయని కూడా తెలిపాడు. ఇక నాగబాబు గురించి కూడా మాట్లాడుతూ ఆయన చాలా మర్యాదపూర్వకంగా షో నుండి వచ్చేసినట్లు తెలిపాడు. ఆయన కూడా తిరిగి షో కు తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేసాడు. ఇదిలా ఉంటే హైపర్ ఆదిని కూడా జీ తెలుగు కామెడీ షోలోకి లాగాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్ వరకూ హైపర్ ఆది చాలా కీలకమైన వ్యక్తి. అతని వల్లే జబర్దస్త్ కు టీఆర్పీలు అధికంగా వస్తుంటాయి. యూట్యూబ్ లో కూడా అతని స్కిట్స్ కే వ్యూస్ ఎక్కువ. ఈ నేపథ్యంలో హైపర్ ఆది ఒక్కడిని లాగితే జబర్దస్త్ లో మిగతా వాళ్ళని కూడా లాగొచ్చని నిఖిల్ అండ్ కో అనుకుంటున్నారు.
అయితే హైపర్ ఆదిని లాగడం అంత తేలికైన వ్యవహారం కాదు. ఇందులో లీగల్ సమస్యలు ఉన్నాయి. మల్లెమాలతో మరే షో లో పాల్గొనబోనని అగ్రిమెంట్ చేసాడు ఆది. మరి ఈ వ్యవహారం ఎంతవరకూ వెళుతుందో, ఇంకా ఎవరెవరు జబర్దస్త్ ను వీడతారో చూడాలి.