
హీరో విశాల్‌కు మరోసారి మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తను నటిస్తున్న తాజా చిత్రం విడుదల విషయంలో స్టేవిధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విశాల్ నటిస్తున్న సైబర్ క్రైమ్ థ్రిల్లర్ `చక్ర` రిలీజ్ వివాదంలో పడింది. ఈ మూవీ నిర్మాణ హక్కులు తనవే అంటూ నిర్మాత రవీంద్రన్ హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో ఈ చిత్ర రిలీజ్‌పై కోర్టు స్టేని విధించింది.
గతంలో ట్రిడెంట్ ఆర్ట్స్ అధినేత రవీంద్రన్ హీరో విశాల్‌తో `యాక్షన్` చిత్రాన్ని నిర్మించారు. భారీ నష్టాలని చవిచూడటంతో తదుపరి చిత్రాన్ని తనకే చేస్తానని విశాల్ మాటిచ్చారట. అందుకు సంబంధించి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట. అయితే దాన్ని అతిక్రమించి తానే నిర్మాతగా `చక్ర` చిత్రాన్ని నిర్మించారు విశాల్. ఇక్కడే వివాదం మొదలైంది.
తనకు చేస్తానన్న చిత్రాన్ని సొంత సంస్థలో చేసుకోవడం నిర్మాత రవీంద్రన్‌కి ఆగ్రహాన్ని తెప్పించిందట. దీంతో మద్రాస్ హైకోర్టుని ఈ మూవీ కథ హక్కుల విషయంలో సంప్రదిస్తే కోర్టు `చక్ర` రిలీజ్‌పై స్టేని విధించడం సంచలనంగా మారింది. 19న చిత్రాన్ని విడుదల చేయాలని విశాల్ ప్రయత్నాలు చేస్తుండగా కోర్టు 18కి కేసుని వాయిదా వేయడంతో విశాల్ లో టెన్షన్ మొదలైందని చెబుతున్నారు.