
మహాభారతం అరణ్యపర్వంలో భాగంగా ఒక సరస్సులో నీళ్ళు తాగడానికి వెళ్ళిన పాండవులను యక్షుడు బంధిస్తాడు. తన తమ్ముళ్ళను విదిపించుకోడానికి వచ్చిన ధర్మరాజుతో ధర్మానికి సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పించి.. సమాజానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు చెప్పిస్తాడు యక్షుడు. అందులో భాగంగా, ఎవరికి మనసు ప్రశాంతంగా ఉండదు.? అని అడిగితే… ఆ ప్రశ్నకు సమాధానంగా ప్రియురాలిని వేళ కాని వేళ కలవబోయే ప్రియుడికి, తనకు సమీపంలోనే శత్రువు ఉన్న సైనికుడికి, నాలుగు దారుల కూడలిలో నిలబడి ఉండే మనిషికి, నిశాచారుడికి, అధికమోహావేశం కలవాడికి మనసు ప్రశాంతంగా ఉండదు.. అని చెప్తాడు ధర్మరాజు.
ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పుకున్నామంటే, ఒకే సమయంలో తన ప్రేయసిని కలుస్తున్న ప్రియుడు; తనని దెబ్బ కొట్టడానికి సిద్దమవుతున్న శత్రువు ఇద్దరి భావాలు, ఆలోచనలు, సంఘర్షణ, మానసిక అస్థిరత ఇవన్నీ ఒకే పాటలో చెప్పే ప్రయత్నం చేసినట్లు ఉంది. ఆ పాట ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తున్న “V” అనే సినిమా తాజాగా రిలీజ్ చేసిన “వస్తున్నా… వచ్చేస్తున్నా” గా మన ముందుకు వచ్చింది.
ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ “అమిత్ త్రివేది” కంపోజ్ చేసిన మ్యూజిక్ మనకు కొత్త అనుభూతి ఇస్తోంది. ఇక ఈ పాట రాసిన వ్యక్తి సాహిత్య రంగంలో ఉన్న ఎవరెస్ట్ శిఖరం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. విరహవేదనతో బాధపడే ఇద్దరు ప్రేమికులకు, విద్వేషంతో రగిలే ఇద్దరు శత్రువులకు కూడా సరిపోయే విధంగా ఆయన రాసిన లిరిక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా “ఇప్పటి ఈ ఒప్పందాలే…. చీకటి తో చెప్పించాలే” అంటూ తన కలానికే కాదు… అందులోనుండి వచ్చిన అక్షరానికి కూడా రెండు వైపులా పదును ఉందని మరోసారి చూపించారు గురువు గారు. ఈపాటలో హీరోయిన్ నివేదా థామస్ ఎక్స్ప్రెషన్స్ హైలెట్. ఇక ఉగాది కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
