
అమెజాన్ ప్రైమ్‌లో అత్యంత జనాదరణ పొందిన హిందీ వెబ్ సిరీస్ `ది ఫ్యామిలీ మ్యాన్`. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ హిందీ వెబ్ థ్రిల్లర్‌లలో సంచలనం సృష్టించింది. 2019 లో అమెజాన్ ప్రైమ్‌లోస్ట్రీమింగ్ అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చాలా మందిని రికార్డు స్థాయిలో ఆకట్టుకుంది. కాన్సెప్ట్ ఫాస్ట్ పేస్‌తో సాగే స్క్రీన్‌ప్లే, సరికొత్త సంఘటనలతో ఒక కొత్తదనంతో ఈ సిరీస్ కు సంబంధించిన ఎపిసోడ్స్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించాయి.
దీంతో మనోజ్ బాజ్‌పేయి, షరీబ్ హష్మి, ప్రియమణి కీలక పాత్రల్లో నటించిన `ది ఫ్యామిలీ మ్యాన్ 2`పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సిరీస్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా మంది చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. రెండవ సీజన్ టీజర్‌ను ఈ ఏడాది జనవరిలో ఆవిష్కరించారు. అప్పటి నుండి ఇది ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. వేసవిలో సీజన్ 2 ను రిలీజ్ చేస్తామని మేకర్స్ రాజ్ నిడిమోరు, కృష్ణ డికె ఈ రోజు ప్రకటించారు.
`ది ఫ్యామిలీ మ్యాన్ కొత్త సీజన్ కోసం మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు. మేము నిజంగా ఎంతో కృతజ్ఞతతో ఉన్నాము. `ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2` ఈ వేసవిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రదర్శించబడుతుంది! మీకు అద్భుతమైన అనుభూతిని అందించడానికి మేము చాలా కష్టపడుతున్నాము. మీరు దీన్ని ఇష్టపడతారని మాకు ఖచ్చితంగా తెలుసు. దీన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇంకా వేచి ఉండలేము`అని మేకర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. జూన్‌లో ఈ సిరీస్ విడుదల కాబోతోంది. ఈ సిరీస్ ద్వారా సమంత డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఆమె అభిమానుల నిరీక్షణ ఫలించబోతోంది.