Homeటాప్ స్టోరీస్`సుల్తాన్‌` మూవీ రివ్యూ

`సుల్తాన్‌` మూవీ రివ్యూ

`సుల్తాన్‌` మూవీ రివ్యూ
`సుల్తాన్‌` మూవీ రివ్యూ

న‌టీన‌టులు:  కార్తీ, ర‌ష్మిక మంద‌న్న‌, నెపోలియ‌న్, అభిరామి, లాల్‌, `కేజీఎఫ్‌` రామ‌చంద్ర‌రాజు, మోగిబాబు, స‌తీష్‌, హ‌రీష్ పెరాది, న‌వాబ్ షా, అర్జ‌ల్‌, సింగంపులి త‌దిత‌రులు న‌టించారు.
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: బ‌క్కియ‌రాజ క‌న్న‌న్‌
నిర్మాత‌లు: ఎస్‌.ఆర్‌. ప్ర‌కాష్‌బాబు, ఆర్‌.ఎస్‌. ప్ర‌భు‌‌
సంగీతం:  వివేక్ -మ‌ర్విన్
నేప‌థ్య సంగీతం:  యువ‌న్ శంక‌ర్ రాజా‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌త్య‌న్ సూర్య‌న్ ‌
ఎడిటింగ్:  రూబెన్‌
రిలీజ్ డేట్‌: 02-04-21
రేటింగ్ : 2.75/5

విభిన్న‌మైన క‌థ‌ల్ని ఎంచుకుంటూ హీరోగా తెలుగు, త‌మిళ భాషల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు హీరో కార్తి. ఇటీవ‌ల `ఖైదీ` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చారు. సినిమాల ప‌రంగా వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న ఆయ‌న తాజాగా `సుల్తాన్‌` పేరుతో మ‌రో కొత్త త‌ర‌హా మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. పాండ‌వుల ప‌క్షాన నిలిచిన కృష్ణుడు కౌర‌వ‌ల‌ ప‌క్షాన నిలిస్తే అంటూ ట్రైల‌ర్ ద్వారానే ఆస‌క్తిని రేకెత్తించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలోనే వుందా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

క‌థ‌:
విక్ర‌మ్ అలియాస్ సుల్తాన్ (కార్తి) ఓ రొబోటిక్ ఇంజినీర్‌. ముంబైలో చ‌దువు పూర్తి చేసుకున్న త‌ను జ‌పాన్‌లో సొంతంగా కంప‌నీ పెట్టాల‌నుకుంటాడు. అదే విష‌యాన్ని తండ్రి సేతుప‌తి (నెపోలియ‌న్‌)కు చెప్పి జ‌పాన్ వెళ్లిపోవాల‌నుకుని సొంత ఊరు విశాఖ‌ప‌ట్నం వ‌స్తాడు. సుల్తాన్ తండ్రి సేతుప‌తి విశాఖ‌లో పేరు మోసిన రౌడీ నాయ‌కుడు. ఇత‌ని వెంట వంద‌కు పైగా సైన్యం వుంటుంది. అవ‌స‌రాన్ని బ‌ట్టి డ‌బ్బులు తీసుకుని హ‌త్య‌లు చేయడం వీరి ప‌ని. కానీ ఈ ర‌క్త‌పాతం, రౌడీయిజం సుల్తాన్‌కు ఏమాత్రం న‌చ్చ‌దు. అనూహ్యంగా తండ్రి చ‌నిపోవ‌డంతో వంద మంది సైన్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్య‌త సుల్తాన్‌పై ప‌డుతుంది. ఈ క్ర‌మంలో తండ్రి ఇచ్చిన మాట కోసం సుల్తాన్ త‌న సైన్యంతో వెల‌గ‌పూడి వెళ్లాల్సి వ‌స్తుంది. అక్కడి గ్రామ‌స్తుల‌పై జ‌యేంద్ర చేస్తున్న అరాచ‌కాల‌కు అడ్డుత‌గులుతాడు. అత‌ని వెన‌కున్న దెవ‌రు? ఆ గ్రామం కోసం, త‌ను ప్రేమించిన రుక్మిణి కోసం సుల్తాన్ ఏంచేశాడు? ఈ క్ర‌మంలో అత‌ని వెంట ఉండాల్సిన సైన్యం ఎందుకు అత‌న్ని వీడి పోతుంది? ఈ క్ర‌మంలో అత‌ను ఎదుర్కొన్న స‌వాళ్లేంటీ?  చివ‌రికి సుల్తాన్ త‌ను అనుకున్న‌ది సాధించాడా? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టుల న‌ట‌న‌:
ఈ త‌ర‌హా పాత్ర‌లో ఆక‌ట్టుకోవ‌డం కార్తీకి చాలా ఈజీ. అందుకే సుల్తాన్ పాత్ర‌లో చాలా చ‌క్క‌గా ఒదిగిపోయారు. సినిమా మొత్తం కార్తీ చుట్టే తిరుగుతుంది. సినిమా ఆద్యంతం చ‌క్క‌టి జోష్‌ని ప్ర‌ద‌ర్శించి ఆక‌ట్టుకున్నారు. ముఖ్యంగా యాక్ష‌న్ ఘ‌ట్టాల్లో కార్తీ హీరోయిజం మాస్ ఆడియ‌న్స్‌ని రోమాంచితుల్ని చేస్తుంది. ప‌తాక ఘ‌ట్టాల్లో, ర‌ష్మిక‌తో వ‌చ్చే స‌న్నివేశాల్లోనూ త‌న‌దైన శైలి న‌ట‌న‌తో న‌వ్వించాడు. ర‌ష్మిక ప‌క్కా ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించింది. అయితే ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ అయిన‌ట్టుగా క‌నిపించ‌లేదు. ఇక మిగ‌తా పాత్ర‌ల్లో నెపోలియ‌న్‌, అభిరామి, లాల్‌, `కేజీఎఫ్‌` రామ‌చంద్ర‌రాజు, మోగిబాబు, స‌తీష్‌, హ‌రీష్ పెరాది, న‌వాబ్ షా, అర్జ‌ల్‌, సింగంపులి త‌దిత‌రులు త‌మ పాత్ర‌ల ప‌రిథి మేర‌కు న‌టించారు.

సాంకేతిక నిపుణులు:
తండ్రి ఇచ్చిన మాట కోసం ఊరికి అంగ‌డ‌గా నిల‌బ‌డే ఓ త‌న‌యుడి క‌థ ఇది. మంచి క‌థ‌నే ఎంచుకున్నా దాన్ని మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా న‌డిపించాల్సిందే. అయితే ఆ లోటు క‌నిపించ‌కుండా యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ని తెరకెక్కించిన విధానం మాస్ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది. తెలుగు ప్రాంతంలో క‌థ న‌డుస్తున్న‌ట్టుగా చూపించినా సినిమా అంతా త‌మిళ వాస‌న క‌నిపిస్తుంటుంది. ఎడిటింగ్ ప‌రంగా మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని వుంటే బాగుండేది. నిడివిని త‌గ్గించాల్సింది. వివేక్ మెర్విన్ పాట‌లు బాగున్నా పాడుకునే స్థాయిలో మాత్రం గుర్తుండ‌వు, యువ‌న్ శంక‌ర్ రాజా అందించిన నేప‌థ్య సంగీతం అ చిత్రానికి ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది. స‌త్య‌న్  సూర్య‌న్ ఫొటోగ్ర‌ఫీ బాగుంది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

తీర్పు:
ఈ మూవీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో కార్తీ చెప్పిన‌ట్టే ఇదొక మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. భార‌తంలో కృష్ణుడు కౌర‌వుల ప‌క్షాన నిలిస్తే ఎలా వుంటుంది అనే ఆలోచ‌న నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు అల్లుకున్న క‌థ ఇది. 100 మంది కౌర‌వ సైన్యం.. ఆ సైన్యం ముందు కార్తి.. ఓ ఊరికిచ్చిన మాట కోసం మ‌రో రావ‌ణ సైన్యంతో పోరాడే తీరు.. ఈ సీరియ‌స్ క‌థ‌లో ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ‌ని చూపించిన తీరు..స్తూలంగా ఇదీ సుల్తాన్ క‌థ‌. ఇలాంటి క‌థ‌ని డీల్ చేయ‌డం ద‌ర్శ‌కుడికి స‌వాలే. అలాంటి స‌వాల్‌ని మాస్ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకునేలా బ‌క్కియ‌రాజ క‌న్న‌న్ తెర‌కెక్కించ‌డంతో స‌క్సెస్ అయ్యారు. అయితే నిడివి విష‌యంతో పాటు హీరో హీరోయిన్‌ల మ‌ధ్య కెమిస్ట్రీ విష‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని వుంటే బాగుండేది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All