
`సాహో` తరువాత సుజీత్ సినిమా ఏంటీ? ఎవరితో వుంటుందని గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన చిత్రం `లూసీఫర్`. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం నచ్చడంతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు.
గత కొన్ని రోజులుగా ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కిస్తాడని, లేదు `సాహో` ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తాడని వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే ఈ చిత్ర తెలుగు రీమేక్ బాధ్యతల్ని చిరంజీవి యువ దర్శకుడు సుజీత్‌కి అప్పగించినట్టు తెలిసింది. ఇప్పటికే మలయాళ కథలో సుకుమార్‌తో పాటు కొంత మంది రైటర్లలతో మార్పులు చేయించిన చిరు ఫైనల్ స్క్రిప్ట్ బాధ్యతల్ని సుజీత్‌కి అప్పగించినట్టు తెలిసింది.
దీంతో చిరు ఇమేజ్‌కి తగ్గట్టుగా సుజీత్ ఫైనల్ స్టోరీలో మార్పులు చేసి స్క్రిప్ట్‌ని పక్కాగా లాక్ చేసినట్టు తెలిసింది. `లూసీఫర్` సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే పొలిటికల్ డ్రామా. చిరు ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తియిన తరువాతే ఈ ఏడాది చివరలో `లూసీఫర్` రీమేక్‌ని మొదలుపెట్టే అవకాశాలు వున్నట్టు తెలిసింది.