
యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన చిత్రం `ఒకే ఒక్కడు` (తమిళంలో `ముదలవన్`). ఒక్క రోజు ముఖ్యమంత్రి అయితే అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈచిత్రం తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయాన్ని సాధించింది. అర్జున్ కెరీర్‌లోనే అత్యంత భారీ స్థాయిలో రూపొందిన సినిమాగా రికార్డులు సృష్టించింది.
ఈ సినిమా కాన్సెప్ట్ తరహాలో ఒక్క రోజు ప్రధానిగా వుండే అవకాశమే రానాకి వస్తే.. ఆయన ఏం చేస్తారు?. ముందుగా పదవిలోకి వచ్చిన తరువాత ఆయన చేసే మొట్టమొదటి పని ఏంటీ? అంటే రానా చెప్పిన సమాధానం ఆసక్తిని కలిగిస్తోంది. … ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక `ఆహా`లో రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న `NO.1 యారీ` కార్యక్రమం ప్రసారం అవుతోంది. ఈ కార్యక్రమానికి మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్ హాజరై సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో రానాని `మీకు ఒక్కరోజు ప్రధానిగా అవకాశం వస్తే ఏం చేస్తారని ప్రశ్నించింది. దీనికి రానా చాలా బ్రిలియంట్‌గా చెప్పిన సమాధానం ఆకట్టుకుంటోంది. `విద్య, వైద్యం అందరికి ఉచితంగా అందేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. అంతే కాకుండా విద్య, వైద్యం ప్రజలకు సక్రమంగా అందిస్తే దేశం అంతా మారిపోతుందని తాను భావిస్తున్నానని రానా అన్నారు. ఇటీవల ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ ఎపిసోడ్ ఆలోచింప జేస్తూనే ఆద్యంతం నవ్వులు పూయించింది. రానా ప్రస్తుతం పవన్‌తో కలిసి `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.