
మలయాళంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల దర్శకుడు సానవాస్ షూటింగ్ స్పాట్‌లోనే కుప్పకూలి మృతి చెందడం ఇండస్ట్రీ వర్గాలు షాక్ కు గురయ్యారు. బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటనని మరవకముందే మలయాళ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది.
నటుడు అనిల్ నెదుమంగాడ్ మరణించడం పలువురిని కలచివేస్తోంది. శుక్రవారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి ఎర్నాకుళం జిల్లా మవత్తుపుళం వెళ్లారట. అక్కడ స్నేహితులతో కలిసి మలంకర డ్యామ్‌లో సరదాగా స్నానం చేయడానికి దిగారట. ప్రమాద వశాత్తు అనిల్ నెదుమంగాడ్ నీటిలో మునిగిపోవడంతో స్నేహితులు వెంటనే అప్రమత్తమై అతన్ని బయటికి తీసుకొచ్చారట.
అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టు స్థానిక డాక్టర్లు వెల్లడించారు. అనిల్ నెదుమంగాడ్ మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్`లో సీఐ సతీష్ కుమార్ పాత్రలో నటించారు. అతని పాత్రకు మంచి పేరొచ్చింది. పృథ్వీరాజ్ సుకుమారన్, బీజు మీనన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, రానా దగ్గుబాటిల కలయికలో సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.