Homeటాప్ స్టోరీస్రాహుల్ సిప్లిగంజ్ జీవితంలో మీకు తెలియని విషయాలు!

రాహుల్ సిప్లిగంజ్ జీవితంలో మీకు తెలియని విషయాలు!

Rahul Sipligunj life secrets
Rahul Sipligunj life secrets

రాహుల్ సిప్లిగంజ్.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఈ పేరే వినబడుతోంది. మూడు నెలల క్రితం వరకూ కూడా రాహుల్ పేరు కొద్ది మందికే తెలుసు కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాహుల్ పేరు సుపరిచితమే. వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచాడు రాహుల్. ఫినాలే వీక్ లో దాదాపు 9 కోట్ల ఓట్లు పోల్ అయితే అందులో దాదాపు 45 శాతం ఓట్లు ఒక్క రాహుల్ కే పడ్డాయి. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయవంతమయ్యాడు రాహుల్ సిప్లిగంజ్.

అసలు ఈ రాహుల్ సిప్లిగంజ్ ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? బిగ్ బాస్ కు వెళ్లే ముందు రాహుల్ జీవితం ఎలా ఉండేది వంటి విషయాలను తెలుసుకుందాం. 1989 ఆగష్టు 22న హైదరాబాద్ లోని ధూల్ పేట్ లో జన్మించాడు రాహుల్ సిప్లిగంజ్. తన బాల్యం, చదువు అంతా హైదరాబాద్ లోనే సాగింది. లయోలా హై స్కూల్ లో పది తరగతి పూర్తి చేసిన రాహుల్ తర్వాత నారాయణ జూనియర్ కాలేజీ నుండి ఇంటర్ చదివాడు. అయితే ఆ తర్వాత మ్యూజిక్ మీద ఉన్న ఆసక్తిగా ఇటు వైపు వచ్చేసాడు. చిన్నప్పటినుండి మ్యూజిక్ మీద రాహుల్ కు ఆసక్తి ఉండేది. ముఖ్యంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని దరువెయ్యడం గమనించిన రాహుల్ వాళ్ళ నాన్న తనని మ్యూజిక్ క్లాసెస్ లో జాయిన్ చేసారు. అక్కడినుండి రాహుల్ జీవితమే మారిపోయింది.

- Advertisement -

మొదటగా రాహుల్ కు స్నేహితుడా సినిమాలో పాడే అవకాశం వచ్చింది. అయితే జోష్ చిత్రం మొదట విడుదలవడంతో అందులోని కాలేజీ బుల్లోడా పాట తన మొదటి పాట అయింది. స్నేహితుడా, జోష్ లో పాడిన రాహుల్ యూనిక్ వాయిస్ నచ్చిన కీరవాణి తన కోరస్ టీమ్ లో జాయిన్ చేసుకున్నారు. అక్కడే రాహుల్ కెరీర్ టర్న్ తీసుకుందని చెప్పొచ్చు. కీరవాణి దగ్గరే కోరస్ సింగర్ గా చేస్తూ దమ్ము, ఈగ, షిరిడీ సాయి వంటి సినిమాల్లో పాటలు పాడాడు.

కీరవాణి దగ్గర ఉండగానే మెలోడీ బ్రహ్మ మణిశర్మ దృష్టిలో పడ్డాడు. రచ్చ, కృష్ణం వందే జగద్గురుమ్, కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు వంటి సినిమాల్లో పాటలు పాడాడు. కాకపోతే నితిన్ నటించిన లై సినిమా వచ్చే వరకూ రాహుల్ అనే సింగర్ ఉన్నాడని చాలా సినిమా సంగీత ప్రియులకు తెలీదు. ఈ విషయం రాహుల్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అందులో రాహుల్ పాడిన బొంబాట్ పాట బ్లాక్ బస్టర్ హిట్టయింది. అలాగే రంగస్థలంలో టైటిల్ సాంగ్, చిత్రలహరి చిత్రంలో గ్లాస్ మేట్స్ అంటూ సాగే సాంగ్, ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్టైన ఇస్మార్ట్ శంకర్ లో బోనాలు సాంగ్ ఇవన్నీ రాహుల్ కెరీర్ కు ఊపునిచ్చాయి.

ఒకవైపు సినిమా పాటలు వస్తున్నా రాహుల్ సిప్లిగంజ్ వాటితోనే సరిపెట్టుకోలేదు. తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి ఇండిపెండెంట్ సాంగ్స్ కంపోజ్ చేయడం, లిరిక్స్ రాయడం వంటివి చేసేవాడు. రాహుల్ సిప్లిగంజ్ కు సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇప్పటికే అందులో 500K+ సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. రాహుల్ చేసిన ఇండిపెండెంట్ సాంగ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్ అయి తనను జనాలకు ఇంకా చేరువ చేసాయి. తన పాటల్లో ఎక్కువగా ఫోక్ టచ్ ఉంటూ మాస్, యూత్ కు దగ్గరగా ఉండడంతో జనాలకు బాగా చేరువయ్యాయి.

మొదటగా చేసిన మగజాతి, మాకి కిరికిరి, దావత్, మంగమ్మ, గల్లీ గా గణేష్ వంటి సాంగ్స్ కు మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయి. మూడు నెలల క్రితం విడుదలైన హిజ్రా సాంగ్ కు అప్పుడే 3.5 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. దావత్ కు 7 మిలియన్ వ్యూస్, గల్లీ కా గణేష్ కు అయితే ఏకంగా 47 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఇదే రాహుల్ సాంగ్స్ లో ఎక్కువ వ్యూస్ వచ్చిన సాంగ్. మంగమ్మ సాంగ్ కు 11 మిలియన్, మాకి కిరికిరి సాంగ్ కు 32 మిలియన్ వ్యూస్, పూర్ బాయ్ కు 12 మిలియన్ వ్యూస్, ఇలా రాహుల్ యూట్యూబ్ లో ఒక సెన్సేషన్.

ఇక నాలుగు నెలల క్రితం బిగ్ బాస్ నుండి పిలుపు వచ్చినప్పుడు రాహుల్ కాస్త ఆలోచించాడు. తన కెరీర్ కు ఇది మంచిదేనా అన్న ఆలోచన రాహుల్ ను వెంటాడింది. అయితే మొత్తానికి రాహుల్ బిగ్ బాస్ కు వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. తర్వాత జరిగినదంతా మీకు తెల్సిందే. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్నాడు. బిగ్ బాస్ టైటిల్ తన కెరీర్ ను కొన్ని మెట్లు ఎక్కిస్తుందని అనుకుంటున్నాడు రాహుల్. మరి అదే జరగాలని మనమూ కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All