
`ప్రవీన్ సత్తారు `పీఎస్‌వీ గరుడవేగ` తో హిట్‌ని సొంతం చేసుకుని దాదాపు మూడేళ్లవుతోంది. అయినా ఇప్పటికి ఆయన నుంచి ఏ సినిమా పట్టాలెక్కలేదు. ఇటీవలే ఆయన కింగ్ నాగార్జునతో ఓ యాక్షన్ థ్రిల్లర్‌ని చేయబోతున్నట్టు ప్రకటించారు. సునీల్ నారంగ్, పి. రామ్మోహన్‌రావు, శరత్‌మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇదిలా వుంటే ఈ సినిమాకి ముందే ప్రవీణ్ సత్తారు ఓ బయోపిక్ ని చేయబోతున్నానని ప్రకటించారు.
అదే బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ బయోపిక్. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తామంటూ ముందుకొచ్చింది. దీని కోసం ప్రత్యేకంగా రైటర్స్‌ని ఏర్పాటు చేసి స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెట్టారు. మూడేళ్లవుతున్నా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. సుధీర్‌బాబు ఇతర చిత్రాల్లో బిజీగా వున్నారు. కానీ ప్రవీణ్ సత్తారు మాత్రం గోపీచంద్ బయోపిక్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూనే వున్నారు.
తాజాగా ఈ ఎదురుచూపులకు ఎండ్ పడినట్టు తెలుస్తోంది. గోపీచంద్ బయోపిక్ ఎంతకీ ప్రారంభం కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రవీణ్ సత్తారు తప్పుకున్నట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు ప్రవీణ్ సత్తారు త్వరలో నాగార్జునతో సినిమాని ప్రారంభించబోతున్నారు. దీంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టే అనే ప్రచారం జరుగుతోంది.