
దర్శకధీరుడు తెరకెక్కించిన సంచలన చిత్రం `బాహుబలి`. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. యవత్ దేశాన్ని టాలీవుడ్ వైపు ఆశ్చర్యంతో చూసేలా చేసిన చిత్రమిది. తెలుగు సినిమా ఖ్యాతిని గొప్పగా చాటిన ఈ సినిమాలోని రెండవ భాగమైన `బాహుబలి ది కన్‌క్లూజన్` విడుదలై నేటికి మూడేళ్లు. ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లని సాధించి భారీతీయ సినీ చరిత్రలోనే సువర్ణాధ్యాయాన్ని లిఖించింది.
ఈ సందర్భంగా ఈ సినిమాపై ప్రభాస్ స్పందించారు. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో జరిగిన అనుభవాల్ని అభిమానులతో పంచుకున్నారు. `దేశ వ్యాప్తంగా అందరూ ఇష్టపడిన `బాహుబలి 2` కేవలం సినిమా మాత్రమే కాదు. నా జీవితంలోనే అత్యంత భారీ చిత్రం. నాకు గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని అందించిన రాజమౌళికి, టీమ్‌కి, నా అభిమానులకు ఎప్పటికీ రుణపడి వుంటా. బాహుబలి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చి మూడేళ్లు పూర్తతోంది. ఈ మూవీలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. మీ అందరి ప్రేమలకు కృతజ్ఞతలు` అన్నారు.
ఈ సందర్భంగా షూటింగ్ సమయంలో తీసుకున్న ఓ ఫొటోని ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే జార్జియాలో కీలక షెడ్యూల్‌ని పూర్తి చేశారు.