
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సినిమాల విషయంలో స్పీడు పెంచిన విషయం తెలిసిందే. రెండేళ్ల విరామం తరువాత సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన పవర్‌స్టార్ `వకీల్ సాబ్` చిత్రంతో పాటు క్రిష్ద దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. మొఘల్ సామ్రాజ్యం కోహినూర్ వజ్రం చుట్టూ ఈ సినిమా సాగనుంది.
ఏ.ఎం. రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్పటికే సైలెంట్‌గా రెండు కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా గత ఐదు నెలలుగా ఈ చిత్ర షూటింగ్‌ని వాయిదా వేశారు. పవన్‌కల్యాణ్ కూడా వ్యాక్సిన్ వచ్చిన తరువాతే ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటానని చెప్పడంతో క్రిష్ ఈ చిత్రాన్ని తత్కాలికంగా పక్కన పెట్టారు. అయితే ఈ చిత్రం ఆగిపోయిందంటూ ప్రచారం మొదలైంది. ఆ కారణంగానే పంజా వైష్ణవ్ తేజ్‌తో క్రిష్ సినిమా మొదలుపెట్టారని రూమర్స్ మొదలయ్యాయి.
ఈ రూమర్స్‌పై దర్శకుడు క్రిష్ స్పందించారు. పవన్‌తో చేస్తున్న సినిమా ఆగిపోలేదని, కరోనా వైరస్ నేపథ్యలో ఈ చిత్ర షూటింగ్‌కి చిన్న బ్రేకిచ్చామని, ప్రస్తుత పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్న తరువాత వచ్చే ఏడాది తిరిగి పవన్ సినిమా షూటింగ్‌ని పునః ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.