
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్ధనలు చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని సోము వీర్రాజు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధిలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్ధనలు చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలంటూ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో రియల్ టైమ్ అభివృద్ధి జరగాలని తాను తిరుపతి వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు చెప్పారు.
అతి పెద్ద తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్.. అభివృద్దికి అనువైన రాష్ట్రమంటూ సోము తెలిపారు. అయితే ఏపీ రాష్ట్రం సరైన దిశలో నడవాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయపడ్డారు. కాగా, సోము వీర్రాజు వ్యాఖ్యలు ఏపీలో సంచలనంగా మారాయి. ఆయన ఎవర్ని టార్గెట్ చేస్తూ అన్నారు..? నిజంగా తిరుమలలో అన్యమత ప్రార్థనలు జరిగాయా..? అంటూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందని గతంలో బీజేపీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను టీటీడీ అధికారులు సైతం ఖండించారు. తిరుమలలో ఎలాంటి అన్యమత ప్రచారం జరగలేదని.. అలా జరిగితే ఉపేక్షించబోమంటూ టీటీడీ కూడా ప్రకటించింది. ఇదిలా ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్‌పై సోము వీర్రాజు కొద్దిరోజుల క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రజాదరణ ఎక్కువని, అతని సేవలను వినియోగించుకుంటామని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసే తాము ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకుంటామని సోము వీర్రాజు చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు తావిచ్చాయి. సేవల వినియోగించుకోవడం అంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తుందేమోనన్న చర్చ మొదలైంది. కొన్ని రోజుల క్రితం అమిత్‌షా హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశం కావడంతో బీజేపీ అధిష్ఠానం జూనియర్ ఎన్టీఆర్‌పై ఫోకస్ పెట్టిందనే వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా సోము వీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలు ఆ ప్రచారానికి బలం చేకూర్చాయి. ఆ భేటీలో అమిత్‌షా-జూనియర్ ఎన్టీఆర్ సుమారు అరగంట పాటు ముఖాముఖి మాట్లాడుకున్నట్లు తెలిసింది. తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకు జగన్ వెళ్లనున్నారన్న సంకేతాల నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది.