
నటీనటులు : కీర్తిసురేష్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, నవీన్‌చంద్ర, నదియా, నరేష్, కమల్ కామరాజు, పపూజిత పొన్నాడ, సుమంత్ శైలేంద్ర తదితరులు నటించారు.
దర్శకత్వం : నరేంద్రనాథ్
నిర్మాత : మహేష్ ఎస్. కోనేరు
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫి : డానీ సంజెజ్ లోపెజ్, సుజిత్ వాసుదేవ్
ఎడిటింగ్ : తమ్మిరాజు
ఓటీటీ రిలీజ్ : నెట్‌ఫ్లిక్స్
రిలీజ్ డేట్ : 04 – 11- 2020
రేటింగ్ : 2.5/5
`మహానటి` వంటి వండర్ ఫుల్ మూవీ తరువాత కీర్తి సురేష్ వరుసగా మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు రీఓపెన్ కాకపోవడంతో రిలీజ్‌కు సిద్ధంగా వున్న సినిమాలన్నీ డైరెక్ట్ ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కీర్తి నటించిన `పెంగ్విన్` ఓటీటీకే వచ్చేసింది. తాజాగా ఆమె నటించిన మరో చిత్రం `మిస్ ఇండియా` కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ మొదలైంది. ఓ సాధారణ యువతి అసాధరణ యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్‌ని చూసి ఇది మిస్ ఇండియా పోటీల నేపథ్య చిత్రం అని పొరపాటు పడే అవకాశం వుంది. కానీ ఇది ఆ కథ కాదు. పైగా దీనికి ఎలాంటి బజ్ కూడా లేదు. పబ్లిసిటీ జీరో.. ఏదో మొక్కుబడిగా తూతూ మంత్రంగా ఈ సినిమాకు పబ్లిసిటీని చేసి మేకర్స్ చేతులు దులిపేసుకున్నారు. దీంతో ఈ మూవీ వస్తోందన్న విషయమే ఎవరికీ తెలియదు. అలా సైలెంట్‌గా వచ్చిన ఈ మూవీ ఎక్కువ మందికి తెలిసే అవకాశం లేదు. అలా నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం అనుకున్న స్థాయిలోనే వుందా? లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
మానస సంయుక్త ( కీర్తి సురేష్) ఓ మధ్య తరగతి అమ్మాయి. తన బాల్యం నుండే విజయవంతమైన వ్యాపారవేత్త కావాలని కలలు కంటుంది. ఆమె తన తాత చేసే ఆయుర్వేద టీ రెసిపీని ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ చేయాలని కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని కారణాల వల్ల సంయుక్త ఫ్యామిలీ అమెరికాకు షిఫ్ట్ అవుతుంది. అక్కడ `మిస్ ఇండియా` పేరుతో టీ వ్యాపారం ప్రారంభిస్తుంది. అయితే అన్పటికే అక్కడ కాఫీ బిజినెస్‌ని రన్ చేస్తున్న కైలాష్ ( జగపతిబాబు) నుంచి పోటీని తట్టుకోవడం కష్టంగా మారుతుంది. అతన్ని తట్టుకుని తన ఛాయ్ బిజినెస్‌లో సంయుక్త ఎలా విజయం సాధించింది? ఈ జర్నీని ఛాలెంజింగ్ తీసుకున్న మధ్య తరగతి యువతి ఎలా తన ప్రయాణంలె విజయాన్ని సాధించి విజేతగా నిలిచింది అన్నదే స్టూలంగా ఈ చిత్ర కథ.
నటీరటుల నటన:
కీర్తి సురేష్ హైలీ టాలెంటెడ్ యాక్టర్ గా `మహానటి`తో ప్రూవ్ చేసుకుంది. ఒక నటిగా ఈ పాత్ర అల్టిమేట్. అలాంటి పాత్రలో మెరిసిన కీర్తి సంయుక్త పాత్రని ఎలా మెప్పిస్తుందన్నది ఊహించనవసరం లేదు. వన్‌మెన్ షోగా తన దైన పంథాలో సంయుక్త పాత్రలో నటించింది. స్ట్రాంగ్ మహిళగా చక్కని నటనని ప్రదర్శించింది. కానీ నచ్చని విషయం ఏంటంటే కీర్తి తన లుక్‌కి భిన్నంగా పీలగా మరీ స్లిమ్‌గా కనిపించడమే. ఇలా దర్శడు ఎందుకు చేశాడన్నది ఎవరికీ అర్థం కాదు. సీరియస్‌తో పాటు కొన్ని సన్నివేశాల్లోనూ కీర్తి పండించిన కామెడీ ఆకట్టుకుంది. ఎంత టాలెంటెడ్ యాక్ట్రెస్ అయినా తన భుజాలపై ఈ చిత్రాన్ని కీర్తి మోయలేకపోయింది. కార్పొరేల్ బిజినెస్‌మెన్‌గా శైలేష్ పాత్రలో జగపతిబాబు తనదైన ముద్ర వేశారు. నవీన్ చంద్ర ఎందుకు నటించాడో అర్థం కాదు. నదియా, నరేష్ వంటి ప్రతిభావంతులు వున్నా వారికి పెద్దగా స్కోప్ కల్పించలేదు. రాజేంద్రప్రసాద్ వున్నా కనిపించేది తక్కువే. పూజిత పొన్నాడ, దివ్యశ్రీపాద, కమల్ కామరాజు ముఖ్య పాత్రల్లో నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
దర్శకుడు నరేంద్ర నాథ్ ఎంచుకున్న ప్రధాన ఉద్దేశం మంచిదే అయినా దాన్ని తెరపైకి తీసుకొచ్చిన తీరు ఆశించిన స్థాయిలో లేదు. అతను కలలు కంటున్న దాన్ని సాధించకుండా ఎప్పటికీ నిలిచిపోని బలమైన మహిళ గురించి సినిమా చేయాలనుకున్నాడు. కానీ దర్శకుడు ఏదో ఒకవిధంగా అనవసరమైన ఎలివేషన్ దృశ్యాలు, సిల్లీ మసాలా ఎపిసోడ్లతో ఒక గజిబిజి మాస్ సినిమా చేశాడు. అదే ఈ సినిమా ప్రధాన ఉద్దేశ్యాన్ని దెబ్బతీసింది.
తమన్ సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలకు పెద్దగా అవకాశం లేదు. కానీ అతను చాలా మంచి పాటలు చేశాడు. నేపథ్యసంగీతం కొన్ని సాధారణ సన్నివేశాలను కూడా ఓ లెవెల్లో చూపించింది. డానీ సంజెజ్ లోపెజ్, సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సంభాషణలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. తమ్మిరాజు ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాత మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీపడలేదు.
విశ్లేషణ:
మిస్ ఇండియా అంటూ మహిళా సాధికారతని తెలియజేస్తూ మంచి కథనే ఎంచుకున్నా దర్శకుడు నరేంద్రనాథ్ దాన్ని మరింత ప్రభావవంతంగా చూపించడంలో విఫలమయ్యాడని తెలుస్తోంది. అనవసరమైన ఎలివేషన్ దృశ్యాలు, సిల్లీ మసాలా ఎపిసోడ్లతో ఒక గజిబిజి మాస్ సినిమా చేశాడు. అదే ఈ సినిమా ప్రధాన ఉద్దేశ్యాన్ని దెబ్బతీసింది. చాలా వరకు ఈ మూవీ మిస్ ఫైర్ అయిందనే చెప్పాలి. అద్భుతమైన నటిని తీసుకుని పేలవమైన సీన్‌లతో సినిమాని గజిబిజిగా స్లో నరేషన్‌తో సాగించడం పెద్ద డ్రాబ్యాక్. కీర్తి విషయంలోనే కాకుండా ఇతర పాత్ర విషయంలోనూ దర్శకుడికి క్లారిటీ కొరవడింది. పేరున్న వారిని ఎంచుకున్నా వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేకపోయాడు. నిర్మాణ విలువలున్నా.. ఆశించిన స్థాయి కథా, కథనాలు లేనప్పుడు అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. `మిస్ ఇండియా` విషయంలోనూ అదే జరిగింది. మహేష్ కోనేరు ఎన్ని కోట్లు గుమ్మరించినా దానికి తగ్గ కథ, కథనాలు లేకపోవడంతో `మిస్ ఇండియా` ఓ విఫల ప్రయత్నంగానే మిగిలిపోయింది.