
సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందన `మహానటి`తో కీర్తి సురేష్ ప్రతిభి ఏంటో యావత్ సినీ ప్రపంచానికి తెలిసింది. ఆ తరువాత నుంచి ఆమెకి నటనకు ఆస్కారం వున్న పాత్రలే అత్యధికంగా వస్తున్నాయి. తాజాగా కీర్తిసురేష్‌కి ఓ షాకింగ్ ఆఫర్ లభించింది. సాక్ష్యత్తు మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో. వివారాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. చిరు ఎండోమెంట్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.
గత ఏడు నెలలుగా లాక్‌డౌన్ కారణంగా ఈ మూవీ చిత్రీకరణ నిలిచిపోయింది. త్వరలోనే ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు చిరంజీవి ఓ తమిళ రీమేక్‌ని ఓకే చేశారు. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం `వేదాలం`. ఈ చిత్రాన్ని చిరుతో అనిల్ సుంకర రీమేక్ చేయబోతున్నారు. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన మెహర్ రమేష్ కీలక పాత్ర కోసం కీర్తి సురేష్‌ని ఎంపిక చేసినట్టు తెలిసింది. `వేదాలం`లో హీరో చెల్లెలి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ వుంది. దాంతో ఆ పాత్రని కీర్తి చేత చేయిస్తేనే బాగుంటుందని చిరంజీవి భావించారట. అదే విషయాన్ని మెహర్ రమేష్‌కు చెప్పడంతో వెంటనే ఆమెని కలిసి ఒప్పించినట్టు తెలిసింది.