
పెద్ద సినిమాల షూటింగ్‌లు ఆగిపోయి దాదాపు ఏడు నెలలవుతోంది. ఇప్పుడిప్పుడే కొన్ని క్రేజీ చిత్రాల షూటింగ్‌లు మొదలయ్యాయి. కొన్ని మొదలవుతున్నాయి. `ఆర్ ఆర్ ఆర్`తో పాటు చాలా చిత్రాలు చిన్న చిన్నగా మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని ఓ షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకున్నాయి. కానీ ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య` షూటింగ్ షెడ్యూల్ గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు.
ఇప్పట్లో `ఆచార్య` స్టార్ట్ కాదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప నేపథ్యంలో ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. అన్ని సినిమాల తరహాలోనే `ఆచార్య` షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నారని తెలిసింది. కోవిడ్ కారణంగా షూటింగ్ పునః ప్రారంభించకూడదని అనుకున్నా తాజా పరిస్థితుల నేపథ్యంలో నవంబర్ మూడవ వారం నుంచి షూట్ మొదలుపెట్టాలని మెగాస్టార్ నిర్ణయించుకున్నారట.
ఇందు కోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలిసింది. నవంబర్ మొదటి వారంలో షూటింగ్ మొదలుపెట్టినా చిరు లేకుండా కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరిస్తారట. ఆ తరువాతే చిరు సెట్లోకి ఎంటర్ అవుతారని, ఆ తరువాత రామ్‌చరణ్ కూడా చిరుతో కలిసి షూటింగ్ లో పాల్గొంటారని వీరిద్దరిపై కీలక ఘట్టాలని కొరటాల సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట.