
`ఢీ` మంచు విష్ణుకు కెరీర్‌ని మార్చిన చిత్రం. శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి విష్ణు కెరీర్‌లో మర్చిపోలేని చిత్రంగా నిలిచింది. జెనీలియా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో దివంగత నటుడు శ్రీహరి పోషించిన పాత్ర సినిమాకు ప్రధాన హైలైట్గా నిలిచింది. ఇక బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. చారి పాత్రలో నవ్వులు పూయించి సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించారు.
సునీల్ టైమింగ్ కూడా ఈ చిత్రానికి ప్లస్‌గా మారింది. 2007లో విడుదలైన ఈ మూవీకి సీక్వెల్‌ని చేయబోతున్నారంటూ గత కొంత కాలంగా వరుస కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హీరో మంచు విష్ణు చేసిన ట్వీట్ ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ నెల 23న ఎక్సైటింగ్ అప్‌డేట్ ఇవ్వబోతున్నాం అంటూ విష్ణు చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
`కొన్ని వేల మంది సినీ ప్రియుల అభిమాన చిత్రం `ఢీ`. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్క నటుడుడికి ఇదొక గేమ్ ఛేంజర్. ఆ రోజుల్లో సినిమాకి సంబంధించిన కొత్త వొరవడికి `ఢీ` శ్రీకాకం చుట్టింది. `ఢీ` కంటే బెటర్ ఏమి వుంటుంది? ` అని మంచు విష్ణు ట్వీట్ చేశారు. దీంతో అంతా `ఢీ`కి సీక్వెల్‌ని 23న ప్రకటించబోతున్నారని చర్చమొదలైంది. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే 23 వరకు వేచి చూడాల్సిందే.