
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ముగిసినా కానీ ఇంకా దాని గురించి వార్తలు మాత్రం ముగియలేదు. ఎంత కాదనుకున్నా ఏదో పక్క నుండి బిగ్ బాస్ గురించి వార్త వస్తూనే ఉంది. బిగ్ బాస్ ముగిసాక విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, రన్నరప్ శ్రీముఖి టీవీలకు, ప్రముఖ యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడిపేస్తున్న సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా ఆమెకు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఎందుకని ఇప్పటివరకూ బిగ్ బాస్ టైటిల్ ను అమ్మాయిలు గెలవలేదు అని. నిజానికి ఈ సీజన్ వరకూ తీసుకుంటే శ్రీముఖి టైటిల్ విన్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆమె టాస్క్ లు ఆడిన విధానం చూసుకున్నా, ఏదైనా విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పాలన్నా, రోజంతా యాక్టివ్ గా ఉండాలన్నా అది శ్రీముఖికే చెల్లింది. హౌజ్ లో ఆమె ఉన్నంత ఎనర్జీతో ఇంకెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. నిజానికి బిగ్ బాస్ 3 ఫైనల్స్ వరకూ తీసుకుంటే టైటిల్ పోరు కోసం తీవ్రమైన పోటీ నడిచింది. రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్ మధ్య చాలా తక్కువ ఓట్ల వ్యత్యాసం ఉంది. టాప్ 3 లో బాబా భాస్కర్ ఎలిమినేట్ అయిపోయినా టాప్ 2 ఫైనలిస్ట్స్ శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నడిచింది. చివరికి రాహుల్ కు టైటిల్ వరించింది.
రాహుల్ కు టైటిల్ వచ్చిన విషయం పక్కనపెడితే అసలు శ్రీముఖికి టైటిల్ ఎందుకు రాలేదు అన్నది ఎవరికీ అర్ధం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే ఝాన్సీ లాంటి యాంకర్లు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా అమ్మాయిలను చూడటానికి ఇంకా ఎవరూ సిద్ధంగా లేరు అని భారీ స్టేట్మెంట్ ఇచ్చింది. శ్రీముఖి కూడా లేటెస్ట్ ఇంటర్వ్యూలో వచ్చే సీజన్లలో బిగ్ బాస్ టైటిల్ అమ్మాయి గెలిస్తే చూడాలని ఉందని అంటోంది.
మొదటి రెండు సీజన్లు తీసుకున్నా గెలిచిన వాళ్ళకంటే ఫైనల్స్ కు చేరిన అమ్మాయిలు ఏ రకంగానూ తీసిపోమని నిరూపించారు. మొదటి సీజన్ లో హరితేజ పంచిన ఎంటర్టైన్మెంట్ ను ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. ఆమె బుర్ర కథ ఎపిసోడ్ చాలా పెద్ద హిట్టైంది. ఇక సెకండ్ సీజన్ లో గీతా మాధురి కూడా ఫస్ట్ నుండి జెన్యూన్ కంటెస్టెంట్ గా నిలిచింది. కౌశల్ ఆర్మీ ఒకటి ఫామ్ అయిపోయి వేవ్ అంతా అటు వెళ్ళిపోయింది కానీ గీతా మాధురి కూడా గట్టి పోటీనే ఇచ్చింది. ఇప్పుడు శ్రీముఖి వంతు. ఇలా గట్టి పోటీని ఇస్తున్నా కానీ ఎందుకని బిగ్ బాస్ టైటిల్ మాత్రం గెలవలేకపోతున్నారు అన్నది అంతు చిక్కట్లేదు.
ఒకటి మాత్రం స్పష్టం. నాలుగో సీజన్ లో ఎవరు పాల్గొన్నా సరే అమ్మాయిలను బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలపాలని ప్రేక్షకులూ కోరుకుంటారు. బిగ్ బాస్ యాజమాన్యం కూడా దానికే ప్రయత్నిస్తుంది. లేదంటే విమర్శలు వచ్చే ఏడాది తట్టుకోవడం మరింత కష్టమవుతుంది.