
వరద రాజకీయాలపై తెలంగాణ శాసనమండలిలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. వరద సమయంలో ప్రజలకు అండగా నిలవకుండా విపక్షాలు రాజకీయం చేశాయని హరీశ్ రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏమి కాలేదని, గతేడాదిలాగే ఈ యాసంగికి కూడా కాళేశ్వరం నీళ్లు అందిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు.
గోదావరి వరదలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మండలిలో జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. చరిత్రలో ఎన్నడు లేనంత వర్షం గోదావరి నదిలో జూలైలో వచ్చిందని, ఆ కారణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయని మండలికి తెలిపారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి ఎంతో ముందు చూపుతో వ్యవహరించి ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూశారని హరీశ్ రావు మండలికి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోకి వరద రావడమన్నది పూర్తిగా ప్రకృతి వైపరీత్యమని, ఇందులో మానవ తప్పిదం లేదని హరీశ్ రావు వెల్లడించారు.
దీనిపై ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ వరద రాజకీయం చేస్తున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రుల వ్యాఖ్యలను హరీష్ రావు తప్పుబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గ్రోత్ ఇంజిన్ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి మాట్లాడిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇప్పుడు కొందరు కేంద్ర మంత్రులు అసలు ప్రాజెక్టుకే అనుమతి లేదని మాట్లాడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ఇదిలా ఉంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు సరఫరాపై విమర్శలు చేసే కాంగ్రెస్, బీజేపీ నేతలను సిద్దిపేట చెరువులో ముంచాలని అంటూ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. జిల్లాలోని నంగునూర్ మండలం రాజగోపాల్ పేట గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు.