
ప్రభాస్ తాజాగా అంగీకరించిన చిత్రం `ఆది పురుష్`. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. టి సిరీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయికి మించి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్, కియారా అద్వానీల పేర్లు వినిపిస్తున్నాయి. తాజా సమచారాం ప్రకారం కియారా అద్వానీని చిత్ర బృందం సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రాకి సంబంధించిన వీఎఫ్ ఎక్స్ కోసం దాదాపు 250 కోట్ల బడ్జెట్‌ని కేటాయిస్తున్నారట. దీన్ని బట్టే సినిమా ఏ రేంజ్‌లో వుండబోతోందనేది స్పష్టమవుతోంది. రామాయణ గాధ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో శ్రీరాముడిగా ప్రభాస్ కనిపించబోతున్నారు. ఆ పాత్ర కోసం ప్రభాస్‌నే ఎందుకు ఎంచుకున్నారో.. ఈ ప్రాజెక్ట్‌ని ఎప్పుడు సెట్స్‌పైకి తీసుకురాబోతున్నారన్న కీలక విషయాల్ని దర్శకుడు ఓం రౌత్ తాజాగా వెల్లడించారు.
శ్రీరాముడిలో కనిపించే ఓ విలుకాడు, ప్రభాస్ నడిచే తీరు, ఎత్తు ఆయనను ఈ సినిమాకు ఎంచుకోవడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని, ఆయనలో శ్రీరాముడి పాత్రను తాను చూసేశానని, అందుకే ప్రభాస్‌ని ఈ చిత్రం కోసం ఫైనల్ చేసుకున్నామని చెప్పారు. ఇక ఈ చిత్రాన్ని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకురాబోతున్నారన్నదానికి సమాధానంగా వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తామని దర్శకుడు ఓం రౌత్ వెల్లడించారు.