
`బాహుబలి` చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది విఎఫ్ ఎక్స్. దీని కారణంగానే ఎపిక్ లుక్ ఈ సినిమాకు ఏర్పడింది. దీని కోసం ఆర్కా మీడియా భారీ స్థాయిలో ఖర్చు చేసిన విషయం తెలిసిందే. మకుట సంస్థ మెస్మరైజింగ్ విజువల్స్‌ని అందించి ఈ చిత్రానికి గ్రాండీయర్ లుక్‌ని తీసుకొచ్చింది. ఇదే పంథాని ప్రభాస్ తాజా చిత్రానికి అనుసరించబోతున్నారా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ తాజాగా అంగకరించిన చిత్రం `ఆది పురుష్`. `తన్హాజీ` ఫేమ్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.
ప్రతిష్టాత్మక టి సిరీస్ సంస్థ దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని సర్వాంగ సుందరంగా, ఓ విజువల్ ట్రీట్‌గా అందించబోతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై సర్వత్రా చర్చమొదలైంది. ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్‌ని ప్రభాస్ ప్రకటించడం పలువురికి ఇప్పటికీ షాకింగ్ గానే వుంది. రామాయణ గాధ ఆధారంగా సరికొత్త పంథాలో ఈ చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్ నటించనున్నాడని క్లారిటీ వచ్చేసింది. సీత పాత్రలో కీర్తి సురేష్, రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించబోతున్నారంటూ ప్రచారం మొదలైంది.
ఇక శూర్పణక పాత్రలో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మంచు లక్ష్మి ప్రకటించింది. ఇదిలా వుంటే వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ చిత్ర వీఎఫ్ ఎక్స్ కోసం మేకర్స్ 250 కోట్లు అంటే ఈ మూవీ బడ్జెట్‌లో సగం కేటాయిస్తున్నారని తెలిసింది. ఇంత భారీ మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ కు కేటాయిస్తున్నారంటే ఈ మూవీ విజువల్ వండర్‌గా తెరపైకి రాబోతుండటం ఖాయంగా కనిపిస్తోందని ఫిల్మ్ లవర్స్ చెబుతున్నారు.