
నటీనటులు: తేజ సజ్జ, ఆనంది, దక్షా నగర్కర్, పృథ్వీ, రఘుబాబు, హేమంత్, అదుర్స్ రఘు, గెటప్ శ్రీను, హర్షవర్ధన్, హరితేజ, అన్నపూర్ణమ్మ తదితరులు నటించారు.
దర్శకత్వం: ప‌్రశాంత్ వర్మ
నిర్మాత: రాజశేఖర వర్మ
సంగీతం: మార్క్ కె రాబిన్
సినిమాటోగ్రఫీ: అనిత్
ఎడిటింగ్: సాయిబాబు
రేటింగ్: 3/5
హాలీవుడ్ లో జాంబీ జోనర్ హిట్ ఫార్ములా. దాన్ని రాయలసీమ ఫ్యాక్షన్‌కి జోడించి ప్రశాంత్ వర్మ `జాంబిరెడ్డి` చిత్రాన్ని తెరకెక్కించాడు. `అ!`, కల్కి వంటి విభిన్నమైన చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ జాంబీ జోనర్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాలనటుడిగా ఆకట్టుకున్న తేజ సజ్జ ఈ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఫస్ట్ బైట్ ..టీజర్, ట్రైలర్‌లతో అంచనాల్ని పెంచేసిన ఈ మూవీ ఆశించిన స్థాయిలోనే వుందా? లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
మారియో (తేజ సజ్జ) ఓ ఆన్‌లైన్ గేమ్ డిజైనర్. తను డిజైన్ చేసిన ఓ గేమ్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తుంటుంది. అయితే అనుకోకుండా దీని కోడింగ్‌లో సాంకేతిక లోపం ఏర్పడుతుంది. ఆ కోడింగ్ చేసిన మారియో మిత్రుడు కల్యాణ్ (హేమంత్) కర్నూల్ లోని రుద్రవరంలో వివాహం చేసుకుంటుంటాడు. అతన్ని వెతుక్కుంటూ మారియో తన బృందంతో కర్నూల్‌లోని రుద్రవరానికి బయలుదేరతాడు. ఈ క్రమంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంటుంది. మారియో మిత్ర బృందంలోని ఓ స్నేహితుడు నరమాంస భక్షకుడిగా జాంబీగా మారిపోతాడు..అదెలా జరిగింది? రఉద్రవరం వెళ్లేసరికి తన బృందంలోని వారంతా జాంబీలుగా ఎలా మారారు? .. కరోనా వ్యాక్సిన్‌కి ఈ బృందానికి వున్న సంబంధం ఏంటీ? మారియో తన వారిని తిరిగి మామూలు మనుషులుగా ఎలా మార్చాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
తెలుగు తెరకు కొత్త అయిన జాంబీ జోనర్ కథతో తేజ సజ్జ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బాలనటుడిగా ఆకట్టుకున్న తేజ ఈ సినిమాలో ఒక్క డ్యాన్స్ తప్పి అన్ని కోణాల్లోనూ తనదైన నటనని ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ స్నేహితుడు కావడంతో తేజని ఎలా చూపిస్తే బాగుంటుందో ఆలోచించి మరీ తేజ పాత్రని మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. హీరోయిజాన్ని ఆవిష్కరించిన తీరు నచ్చుతుంది. తేజ హీరోయిన్‌ని కాపాడే సన్నివేశంతో పాటు జాంబీలతో ఫైట్ చేసే సన్నివేశాల్లోనూ మంచి ఈజ్‌ని ప్రదర్శించి ఆకట్టుకున్నాడు.
హీరోయిన్‌లు ఆనంది, దక్ష నగర్కర్ తమ తమ పాత్రల్లో నటించి అలరించారు. పృథ్వీ, రఘుబాబు, హేమంత్, అదుర్స్ రఘు, గెటప్ శ్రీను, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ, హరితేజ తమ పాత్రల పరిథిమేరకు నటించి మెప్పించడమే కాకకుండా నవ్వించారు.
సాంకేతిక వర్గం:
ఈ సినిమా విషయంలో ప్రధానంగా చెప్పుకోవలసింది సాంకేతిక వర్గం గురించి. సినిమా సాంకేతికంగా వున్నతంగా వుంది. మార్క్ కె రాబిన్ అందించిన నేపథ్య సంగీతం థ్రిల్‌ని పండమే కాకుండా ప్రధాన భూమికని పోషించింది. ఈ సినిమాకు మరో ప్రధాన భూమికను పోషించింది ఛాయాగ్రహణం. అనిత్ చక్కని విజువల్స్‌తో ఆకట్టుకున్నాడు. కళాదర్శకుడు నాగేంద్ర పినితనం ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
తెలుగులో వచ్చిన తొలి జాంబి జోనర్ మూవీ ఇది. దీనికి ఫ్యాక్షన్ నేపథ్యాన్ని జోడించి తెరపై దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆవిష్కరించిన తీరు ఆకట్టుకునేలా వుంది. తెలుగులో ప్రేక్షకులకు తెలియని జోనర్ అయినా దాన్ని పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కించి ప్రేక్షకుల్ని మెప్పించడంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ నూటికి నూరు శాతం విజయం సాధించాడు. ప్రస్తుత వాతావరణానకి తగ్గట్టుగా చూపిస్తూ పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.