
తమిళ హీరో విశాల్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయనకు సంబంధించిన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పనిచేస్తున్న రమ్యకు విశాల్‌కు మధ్య వివాదం నడుస్తోంది. విశాల్ బయటికి కనిపించినట్టుగా హీరో కాదని, అతను విలన్ అని, తన ముందు చాలా సంఘటనలు జరిగాయని, దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా తన వద్ద వున్నాయంటూ మేనేజర్ రమ్య హీరో విశాల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
అంతకు ముందు తమ సంస్థలో రమ్య 45లక్షలు కాజేసిందని ఆరోపిస్తూ చెన్నై లో విశాల్ నిర్మాణ సంస్థకు చెందిన ఓ వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కూడా రమ్య సంచలన వ్యాఖ్యలు చేయడంతో కోలీవుడ్‌లో ఈ వివాదం పెద్ద దుమారమే రేపింంది. అయితే తాజాగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండీల్ నుంచి అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇకపై తమ సంస్థకు, రమ్యకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది.
`మా కంపెనీలో కొన్నేళ్లుగా రమ్య ఛీఫ్ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆమె 45 లక్షల వరకు కాజేసింది. ఈ విషయాన్ని సాధారణ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఆమెపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశాం. కాబట్టి రమ్యతో ఎవరైనా ఎలాంటి లావాదేవీలు జరిపినా దానికి వారే బాధ్యులు. రమ్యతో జరిపిన ఆర్థిక వ్యవహారాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు` అని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది.