
డిజిటల్ మీడియా జోరు మామూలుగా లేదు. సినిమాలకి రావాలంటే థీయేటర్‌కి రావాలి. తిక్కెట్టు కొనాలి. అయితే డిజిటల్ మీడియాలో ఏదైనా వెబ్ సిరీస్ చూడాలంటే థియేటర్‌కి వెళ్లాల్సిన పని లేదు. స్మార్ట్ ఫోన్.. అందులో ఇంటర్నెట్ వుంటే చాలు.. ఇదే ఇప్పుడు వెబ్ సిరీస్‌లకి, డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌కి అడ్వాంటేజ్‌గా మారింది. స్టార్స్ కూడా వెబ్ సిరీస్‌లు చేయడానికి ముందుకు వస్తుండటంతో వెబ్ సిరీస్ ల క్రేజ్ రోజు రోజుకి ఎక్కువవుతోంది.
తాజాగా ఈ జానర్‌లోకి `మనం` ఫేమ్ క్రేజీ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ ఎంటరవుతున్నారు. గత కొంత కాలంగా హిట్‌లు లేకపోవడం, సూర్యతో చేసిన `24`, అఖిల్‌తో చేసిన `హల్లో`, నాని నటించిన `గ్యాంగ్ లీడర్` వరుసగా ఫ్లాప్ కావడంతో తదుపరి సినిమా కంటే వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తే బాగుంటుందని విక్రమ్ కుమార్ భావించాడట. ఇదే సమయంలో ఆయన్ని అమెజాన్ ప్రైమ్ సంప్రదించి ఓ డీల్‌ని కుదుర్చుకుందట.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ఈ వెబ్ సిరీస్‌లో నాగచైతన్య, అనుష్క కీ రోల్స్ పోషించే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్‌ని ప్రధాన భారతీయ భాషల్లో రిలీజ్ చేయాలని కూడా అమెజాన్ ప్రైమ్ వర్గాలు ప్లాన్ చేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలోనే బయటికి రానున్నట్టు కోలీవుడ్ సమాచారం.