
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తొలిసారి రీమేక్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ముచ్చటగా మూడవసారి తెరకెక్కించిన చిత్రం `అల వైకుంఠపురములో`. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి వసూళ్ల పరంగా బన్నీ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్‌లని సాధించిన చిత్రంగా నిలిచింది.
ఈ సినిమా తరువాత యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని చేయనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఎస్. రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించాలని ప్లాన్ చేశారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ వుంటుందని, ఎన్టీఆర్ 30వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తారని తెలిసింది.
అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం `ఆర్ ఆర్ ఆర్`లో నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ పూర్తయితేకానీ ఎన్టీఆర్ ఫ్రీ అయ్యే అవకాశం లేదు. కరోనా వైరస్ కారణంగా `ఆర్ ఆర్ ఆర్` కీల షెడ్యూల్ షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు వస్తేనే కానీ `ఆర్ ఆర్ ఆర్` షెడ్యూల్ ప్రారంభం కాదు. ఇది పూర్తయితే కానీ త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కదు.
అయితే అందుకు సమయం వుండటంతో ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ ఓ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించాలనుకుంటున్నాడట. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్ర రీమేర్ హక్కుల్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ట్ సంస్థ సొంతం చేసుకుంది. ఆ కథని త్రివిక్రమ్ చేత రీమేక్ చేయించాలని ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే ఈ రీమేక్ కోసం దగ్గుబాటి రానాని సంప్రదించారని తెలిసింది. రానా కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తిగా వున్నారట.