
గత ఏడాది ప్రారంభంలో `అల వైకుంఠపురములో` చిత్రంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇండస్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలనుకున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ మధ్యలో ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఆ ప్రాజెక్ట్ కాస్తా కొరటాల శివ చేతుల్లోకి వెళ్లింది.
ఇటీవల ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దీంతో త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని సూపర్‌స్టార్ మహేష్ తో చేయబోతున్నారని ఈ భారీ ప్రాజెక్ట్‌ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మించబోతున్నారని వార్తలు మొదలయ్యాయి. ఆ వార్తల్ని నిజం చేస్తూ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మహేష్, త్రివిక్రమ్‌ల కలయికలో వచ్చిన `అతడు` చిత్రంలోని ఓ సీన్‌కి సంబంధించిన వీడియోని ట్వీట్ చేసింది.
అంతే కాకుండా `మీరంతా ఏ వార్త కోసం ఎదురుచూస్తున్నారో అది ఫైనల్‌గా రాబోతోంది. ఈ రోజు సాయంత్రం 4:05 నిమిషాలకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ట్విట్టర్ హ్యాండిల్‌లో చూడండి` అంటూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ పోస్ట్ పెట్టారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మహేష్ – త్రివిక్రమ్‌ల కలయికలో ఇంతకు ముందు అతడు, ఖలేజా వంటి చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. ఇది ముచ్చటగా మూడవ సినిమా కావడం విశేషం.