Homeటాప్ స్టోరీస్మూవీ రివ్యూ: తలైవి

మూవీ రివ్యూ: తలైవి

Thalaivii Movie Review
Thalaivii Movie Review

తారాగణం: కంగనా రనౌత్, అరవింద్ స్వామి, సముద్రఖని, నాజర్, పూర్ణ, మధుబాల, భాగ్యశ్రీ తదితరులు
దర్శకత్వం: ఏఎల్ విజయ్
నిర్మాతలు: విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్
సంగీత దర్శకత్వం: జివి ప్రకాష్ కుమార్
రేటింగ్ : 3/5

బాలీవుడ్ కాంట్రవర్షియల్ నటి కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో చేసిన చిత్రం తలైవి. ఈ సినిమాను ప్యాన్ ఇండియా వైడ్ గా విడుదల చేసారు. తమిళనాడు లెజండరీ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో అరవింద్ స్వామి ఎంజిఆర్ పాత్రలో నటించాడు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

కథ:
యుక్త వయసులో జయలలిత (కంగనా రనౌత్) సినిమాల్లో నటించడానికి ఇష్టం లేకుండానే ఒప్పుకుంటుంది. తన తల్లి (భాగ్యశ్రీ) దీనికి ఒప్పిస్తుంది. తొలి చిత్రమే ఎంజి రామచంద్రన్ (అరవింద్ స్వామి) సరసన నటిస్తుంది. వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. వాళ్ళిద్దరి పెయిర్ సూపర్ హిట్ గా మారుతుంది. వరసగా సినిమాల్లో కలిసి నటిస్తారు.

అయితే ఎంజిఆర్ రాజకీయాల్లోకి వచ్చాక జయలలితను కావాలనే దూరం పెడతారు, దాంతో జయలలిత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎంజిఆర్ స్వయంగా ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తారు. కష్టపడి పనిచేసి “అమ్మ” పదాన్ని తనకు పేరులా మార్చుకుంటుంది. అయితే ఎంజీఆర్ చనిపోవడంతో జయలలిత జీవితం తలక్రిందులు అవుతుంది. ఇంటా బయటా ఆమెకు అవమానాలు ఎదురవుతాయి. దాన్నుండి జయలలిత ఎలా బయటపడింది. మగవారి డామినేషన్ ఉన్న రాజకీయాల్లో ఆమె ఎలా నెగ్గుకువచ్చింది, తమిళనాడు రాజకీయాలను ఎలా శాశించింది అన్నది మిగిలిన కథ.

నటీనటులు:
కంగనా రనౌత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. జయలలితగా తనను మించి ఇంకెవరూ బాగా చేయలేరన్న విధంగా కంగనా పెర్ఫర్మ్ చేసింది. సెకండ్ హాఫ్ లో ఆమె నటన అద్భుతం. జయలలితగా పూర్తిగా ఓన్ చేసుకుని నటించింది. ఇక అరవింద్ స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంజీఆర్ పాత్రలో జీవించేసాడు. కంగనా రనౌత్ చుట్టూ తిరిగే సినిమాలో తాను డామినేట్ చేసాడంటే అది మాములు విషయం కాదు.

ఇక నాజర్, సముద్రఖని తమ అద్భుతమైన నటనతో సినిమాను ముందుకు తీసుకెళ్లారు. మిగిలిన వారంతా కూడా ఓకే.

సాంకేతిక వర్గం:
సాంకేతికంగా తలైవి బలంగా నిలిచింది. ఒకే సినిమాలో అటు తమిళనాడు లెజండరీ ఎంజీఆర్, జయలలిత పాత్రలను హ్యాండిల్ చేయడం మాములు విషయం కాదు. దాన్ని ఏఎల్ విజయ్ సమర్ధవంతంగా నడిపాడు. అయితే జయలలిత జీవితం ఒక తెరిచిన పుస్తకం వంటిది. చాలా మందికి తెలిసిన విషయాలే ఈ సినిమాలో కూడా చూస్తాం. ఆ విధంగా చూస్తే నిరాశ తప్పదు.

జివి ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ లో ఒకటిగా నిలిచింది. కొన్ని రొటీన్ సన్నివేశాలను కూడా హైలైట్ చేసాడు తన మ్యూజిక్ తో. అయితే సాంగ్స్ విషయంలో మాత్రం నిరాశ తప్పదు. విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.

చివరిగా:
జయలలిత జీవితాన్ని ఈ సినిమా ద్వారా మరోసారి తరచి చూపించారు. ఆమె జీవితంలో కీ పాయింట్స్ ను ఈ సినిమాలో బాగా ప్రెజంట్ చేసాడు దర్శకుడు. ముఖ్యంగా ఎమోషనల్ పార్ట్ ను డీల్ చేసిన విధానం బాగుంది. జయలలిత పట్ల అభిమానం ఉంటే కచ్చితంగా తలైవి మీకు బెస్ట్ వాచ్ గా అనిపిస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All