
బాలీవుడ్ లో స్వర భాస్కర్ అనే ఒక నటి ఉంటుంది. ఆమె పేరు సినిమాల్లోని తన నటన ద్వారా ఎంత వినిపించిందో తెలీదు కానీ అక్కర్లేని కాంట్రవర్షియల్ విషయాలతో ఎక్కువ పాపులర్ అయింది. సంబంధం ఉన్నా లేకున్నా సమాజంలో జరుగుతున్న విషయాల గురించి స్పందించడం, బోల్డ్ అన్న పేరుతో ఇష్టమొచ్చినట్లు వాగడం, ఏమైనా అంటే మహిళా అంటూ స్వరం పెంచడం ఈవిడగారికి బాగా అలవాటైపోయాయి. ఈ మధ్య ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.
స్వర భాస్కర్ ఇటీవలే ఒక కామెడీ షో కు వెళ్లిందట. ఆ షో లో ఆమె మాట్లాడుతూ పిల్లల్ని దయ్యలతో పోల్చింది. ఇప్పుడదే వివాదానికి కారణమైంది. అంతటితో ఆగిపోయినా బాగుండేది కానీ ఆమె ఎక్కడా తగ్గలేదు. ఆమె తొలినాళ్ళలో యాడ్ షూట్ జరుగుతుండగా ఒక పిల్లడు తనను ఆంటీ అనడాన్ని తెలియజేస్తూ ఆ పిల్లాడ్ని అసభ్యపదజాలంతో దూషించింది. ఈ కామెడీ షో ప్రసారమయ్యాక ఆమె మీద ట్రోల్స్ ఒక రేంజ్ లో రావడం మొదలయ్యాయి. పిల్లల్ని అలా నోటికొచ్చినట్లు ఎలా తిడతావ్ అంటూ నెటిజన్లు ఆమెను దూషించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా గతంలో ఆమె మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలను తవ్వడం మొదలుపెట్టారు.
ఏదో పబ్లిసిటీ కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన స్వర భాస్కర్ జరిగిన నష్టాన్ని త్వరగానే గుర్తించింది. ఆమె వ్యాఖ్యలపై జరుగుతున్న రభసకు నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది. తన ఉద్దేశం అది కాదని, పిల్లలంటే తనకు చాలా ఇష్టమని, పిల్లల్ని దయ్యలతో పోల్చడం చాలా సరదాగా జరిగిందని ఆమె కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. నేను మాట్లాడిన కామెడీ షో ఎలాంటిదో తెలిస్తే తన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకునే వారు కాదు అంటూ తప్పునంతా ఆ షో పై నెట్టే ప్రయత్నం చేసింది. నేను ఆ పిల్లాడిపై చేసిన వ్యాఖ్యలు కూడా సరదాగా అన్నవే. ముంబైలో తన తొలిరోజు షూటింగ్ అనుభవాలను అలా సరదాగా పంచుకోవాలనుకున్నా. పిల్లల కోసం ఏదైనా చేయాలనుకునే వారిలో నేను కూడా ఒకరిని అని స్వర భాస్కర్ వెల్లడించింది. అయితే ఇంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా నెటిజన్లు శాంతించకపోవడం గమనార్హం.