
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్`. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. 1920 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరంభీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. `రౌద్రం రణం రుథిరం` పేరుతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ హంగులతో ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
ఇప్పటి వరకు జరిగిన షూటింగ్‌తో 70 శాతం పూర్తయింది. అలియాభట్ ఎంటర్ కావాల్సి వుంది. ఆమెపై పూనే నేపథ్యంలో పలు కీలక ఘట్టాల్ని తెరకెక్కించాలని రాజమౌళి ప్లాన్ చేశారు. కానీ ఆ ప్లాన్‌కి కరోనా వైరస్ భారీ దెబ్బతీసింది. దీంతో షూటింగ్‌ని వాయిదా వేశారు. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే ఈఏడాది జూలై 30న రిలీజ్ చేయాలని ముందు ప్లాన్ చేశారు. ఆ తరువాత దీన్ని 2021 జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ డేట్ కూడా మారే అవకాశం వుందని చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో బ్యాలెన్స్‌గా వున్న 30 శాతం షూటింగ్ పూర్తి చేయడం, వీఎఫ్ ఎక్స్ పనుల్లో కూడా జాప్యం ఏర్పడే అవకాశం వుండటంతో వచ్చే ఏడాది జనవరి 8న కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదని దానయ్య వెల్లడించినట్టు తెలిసింది.