
నటీనటులు: రామ్ పోతినేని, మాల్వికశర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్, సంపత్‌రాజ్, సత్య, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, నాజర్, హెబా పటేల్, సోనియా అగర్వాల్ తదితరులు నటించారు.
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాత: స్రవంతి రవికిషోర్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ : సమీర్‌రెడ్డి
ఎడిటర్ : జునైద్ సిద్ధిఖీ
రిలీజ్ డేట్ : 14- 01- 2021
రేటింగ్ : 2.5/5
`ఇస్మార్ట్ శంకర్`తో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని మాంచి జోష్ మీదున్నారు ఎనర్జిటిక్ స్టార్ రామ్. పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్ తరువాత రామ్ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తూ యాక్షన్ థ్రిల్లర్ `రెడ్` మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ హిట్ చిత్రం `తడం` ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలోనే వుందా? ఒరిజినల్ వెర్షన్‌కి మార్పులు చేర్పులు సినిమాకు ప్లస్ అయ్యాయా.. రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన `రెడ్` ఆడియన్స్ అంచనాలను ఏ మేరకు రీచ్ కాగలిగింది? వంటి విషయాలు తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
రామ్ ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. ఆదిత్య, రామ్ ఇద్దరు కలవలలు. పోలికలు ఒకేలా వున్నా వారి వ్యక్తిత్వాలు, అభిప్రాయాలు, ఆలోచనలు చాలా భిన్నంగా వుంటాయి. సిద్ధార్ధ్ ఓ ఇంజినీర్. బాగా స్థిరపడిన వ్యక్తి. కానీ ఆదిత్య అలా కాదు. నేర చరిత్ర అతనిది. బ్రతకడం కోసం నేరాలు చేస్తుంటాడు. అక్ష అనే యువతి హత్యకు గురవుతుంది. ఆ నేరం కింద సిద్ధార్ద్‌ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇదే సమయంలో మరో కేసు కారణంగా ఆదిత్య కూడా అరెస్ట్ అవుతాడు. ఇంతకీ అక్ష ఎవరు? . ఆమెని హత్య చేసింది సిద్ధార్ధానా? లేక ఆదిత్యనా? .. ఇంతకీ హత్య జరిగిన స్థలంలో వున్నది ఎవరు? అన్నది పోలీసులకి సంకటంగా మారుతుంది. ఆదిత్య, సిద్ధార్ధ్‌లలో ఎవరు అక్షని హత్య చేశారన్నదే ఈ చిత్ర అసలు కథ.
నటీనటుల నటన:
`ఇస్మార్ట్ శంకర్`లో మాసీవ్ పాత్రని ఓ రేంజ్‌లో పండించి మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించిన రామ్ ఈ చిత్రంలోనూ ఆదిత్య పాత్రలో అదే మార్కు నటనని ప్రదర్శించాడు. ఒక దశలో `ఇస్మార్ట్ శంకర్`ని గుర్తు చేశాడు. ఇక సాఫ్ట్‌గా కనిపించే క్లాస్ పాత్ర సిద్ధార్ధ్. ఈ పాత్రలో ఫార్మల్స్ ధరించి మరింత క్లాస్‌గా కనిపించడానికి ప్రయత్నించాడు. రెండు పాత్రల్లో చక్కని వేరియేషన్‌ని చూపించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక రామ్ తరువాత నటనకు స్కోప్ వున్న పాత్రలో నివేదాథామస్ పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకుంది. కానీ మాల్వికశర్మ, అమృతా అయ్యర్‌లకు ఇందులో నటించడానికి పెద్దగా స్కోప్‌లేదు. సంపత్‌రాజ్, సత్య, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, నాజర్, హెబా పటేల్, సోనియా అగర్వాల్ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు. సత్య నవ్వించే ప్రయత్నం చేశాడు.
సాంకేతిక నిపుణులు:
రొమాంటిక్ లవ్‌స్టోరీస్‌ని అందించడంతో కిషోర్ తిరుమలకు మంచి పట్టుందని నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి, చిత్రలహరి చిత్రాలతో నిరూపించారు. కానీ థ్రిల్లర్ విషయంలో మాత్రం తడబడ్డాడు అనిపిస్తోంది. మాతృకని తెలుగు కోసం ఎంత మార్చినా పెద్దగా వుపయోగం లేకుండా పోయింది. మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్లస్‌గా నిలిచాయి. సమీర్‌రెడ్డి ఫొటోగ్రఫీ, కిషోరర్ తిరుమల అందించిన డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి. అయితే ఎడిటర్ జునైద్ సిద్ధిఖీ తన కత్తెరకు మరింత పదును పెడితే బాగుండేది. సాగదీత ధోరణిలో సాగిన సన్నివేశాలు సినిమాకు మైనస్‌గా మరాయి.
తీర్పు:
ఎనర్జిటిక్ హీరో రామ్, కిషోర్ తిరుమల తొలిసారి తమ పంథాకు పూర్తి భిన్నంగా వెళ్లి చేసిన సినిమా ఇది. వీరిద్దరి ప్రీవియస్ సినిమాల్ని ఇష్టపడిన ప్రేక్షకులకు `రెడ్` ఆశించిన స్థాయిలో మాత్రం సంతృప్తిని ఇవ్వదు. తెలుగు కోసం చేసిన మార్పులు, స్లోనరేషన్.. సినిమా ఫలితాన్ని మార్చేశాయి. దీంతో `ఇస్మార్ట్ శంకర్` ఊపుని కొనసాగించి మరో బ్లాక్ బస్టర్‌గా రామ్ ఖాతాలో చేరాల్సిన `రెడ్` జస్ట్ ఓకే చిత్రంగా నిలిచిపోయింది.