
ఎలాంటి దర్శకుడు ఎలా తయారయ్యాడు. ఒకప్పుడు అందరికీ స్ఫూర్తి కలిగించేలా సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు తన ఉనికి కోసం సినిమాలు చేసుకునే స్థాయికి దిగజారిపోయాడు. ఒకప్పుడు టెక్నీకల్ గా అత్యున్నత స్థాయిలో సినిమాలు చేసిన వర్మ ఇప్పుడు నాసిరకమైన సినిమాలు తీస్తూ ఇష్టముంటేనే చూసుకోండి లేదంటే మానేయండి అంటున్నాడు. ఒకప్పుడు ఆసక్తికరమైన కథలతో సినిమాలు తీసే వర్మ ఇప్పుడు ఎవరో ఒకర్ని టార్గెట్ చేయనిదే సినిమా తీయలేకపోతున్నాడు. సినిమాను మసి పూసి మారేడు కాయ చేసేసి సినిమాను అమ్ముకుంటే చాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే గత రెండు, మూడు సినిమాల నుండి నారా, నందమూరి ఫ్యామిలీస్ ను టార్గెట్ చేస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి దానికి స్ఫూర్తి నందమూరి బాలకృష్ణ అని చెప్పాడు. దీని వెనుక ఫండింగ్ ఎవరున్నారు అనేది కూడా అందరికీ తెల్సిన విషయమే. కొంతలో కొంత వర్మ నుండి వచ్చిన కొంచెం బెటర్ సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. సార్వత్రిక ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా టీడీపీకి వ్యతిరేకంగా బానే పనిచేసింది.
ఈ సినిమా తర్వాత వర్మకు ఏం చేయాలో తెలీక మరొకసారి నారా, నందమూరి ఫ్యామిలీనే టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఈసారి కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా తీసాడు. టైటిల్ చూస్తుంటేనే ఇది ఎవరిని టార్గెట్ చేసి తీసిన సినిమానో అర్ధమవుతోంది. ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా సినిమా నాసిరకంగా ఉంది. అయితే దాన్ని కప్పి పుచ్చే స్టఫ్ సినిమాలో భేషుగ్గా ఉంది. ఇందులో ఎవరినీ వదల్లేదు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, కెఏ పాల్ ఇలా అందరినీ పోలి ఉండే నటులను తీసుకుని ఆడియన్స్ ను మాయ చేసాడు. ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మ దగ్గర ఉన్న ఒకే ఒక్క మంచి లక్షణం.. తాను చెప్పాలనుకున్నది ధైర్యంగా చెప్పగలగడం.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఇంకా విడుదల కాకుండానే రామ్ గోపాల్ వర్మ తన తర్వాతి సినిమాను మొదలుపెట్టేశాడు. నిన్న ట్విట్టర్ లో తర్వాతి సినిమా పేరు మెగా ఫ్యామిలీ అని ప్రకటించి సంచలనం సృష్టించాడు. టైటిల్ చూస్తే ఈసారి ఎవర్ని టార్గెట్ చేస్తున్నాడో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుగా. తొలి నుండి మెగా ఫ్యామిలీపై సెటైర్లు వేయడం వర్మకు అలవాటే. పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ అంటూనే పవన్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడతాడు వర్మ. అయితే ఈసారి మొత్తం మెగా ఫ్యామిలీను టార్గెట్ చేస్తూనే ఒక పొలిటికల్ వండి వార్చబోతున్నాడు. రామ్ గోపాల్ వర్మ కొద్దిసేపటి క్రితం ఈ చిత్ర వివరాల్ని తెలియజేసాడు. “మెగా ఫ్యామిలీ అనే చిత్రం 39 మంది పిల్లలున్న ఒక వ్యక్తి కథ. నేను చిన్న పిల్లల సినిమాలు తీయలేను కాబట్టి ఈ చిత్రాన్ని నేను డైరెక్ట్ చెయ్యట్లేదు” అని ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. దీనిబట్టి ఆర్జీవీ చెప్పాలనుకున్నది ఏంటి? ఒకే ఫ్యామిలీ నుండి ఎక్కువ మంది హీరోలు మెగా ఫ్యామిలీలోనే ఉన్నారు. ఈ యాంగిల్ లో ఏమైనా సినిమా ఉంటుందా? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఏదేమైనా ఒక ఫ్యామిలీ తర్వాత ఒకర్ని టార్గెట్ చేస్తూ ఆర్జీవీ శత్రువులను పెంచుకుంటున్నాడు.
MEGA FAMILY is about a man who has 39 children but since there are too many children and I am not good in making children’s films,I decided not to make it
— Ram Gopal Varma (@RGVzoomin) October 29, 2019
Credit: Twitter