
వెండితెరపై మెగాస్టార్ , మెగా పవర్‌స్టార్ ఇద్దరు కలిసి మళ్లీ తెరపై మెస్మరైజ్ చేయబోతున్నారు. ఇందుకు రాజమౌళి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. క్రేజీ ప్రాజెక్ట్‌గా మొదలైన ఈ చిత్రంపై ఇటీవల స్టోరీ కాపీ అంటూ సంచలన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ మూవీలో రామ్‌చరణ్ కీలక అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని చిరు ప్రకటించినా లాక్‌డౌన్ కారణంగా ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. దీంతో ఇందులో చరణ్ నటించడం కష్టమనే వాదన తెరపైకి వచ్చింది. తాజాగా ఆ అడ్డంకులన్నీ తొలగిపోయాయని చరణ్ `ఆచార్య`లో నటిస్తున్నారని మెగా క్యాంప్ టాక్.
ఈ చిత్రంలో చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా కనిపించబోతున్నారు. కీలకమైన అతిథి పాత్రలో రామ్‌చరణ్ కనిపించబోతున్నారు. అన్యాయంపై గళం విప్పే రెబల్‌గా చరణ్ పాత్ర చాలా పవర్ఫుల్‌గా వుంటుందని, 45 నిమిషాల పాటు ఆయన పాత్ర సాగుతుందని, సినిమాకు చిరు పాత్రని మించి రామ్‌చరణ్ పాత్ర హైలైట్‌గా నిలవనుందని తెలిసింది. త్వరలో షూటింగ్ కి సిద్ధమవుతున్న ఈ చిత్రం కోసం రాజమౌళి మెగా హీరో రామ్‌చరణ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.