
అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డుల్ని దక్కించుకున్న రాజేష్ టచ్‌రివర్ తెరకెక్కించనున్న తాజా చిత్రం `సైనైడ్`. మిడిల్ ఈస్ట్ పై.లిమిటెడ్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రదీప్ నారాయణ నిర్మించబోతున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకు చెందిన నటోరియస్ క్రిమినల్ సైనైడ్ మోహన్ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు.
ఈ చిత్రంలోని కీలక పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి నటించబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా ప్రకటించారు. దేశంలోనే అత్యంత సంచలనం సృష్టించిన సైనైడ్ మోహన్ కేసు ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మించబోతున్నారు. దక్షిణాది భాషల్లో ప్రియమణి పోషించనున్న పాత్రని హిందీలో యష్‌పాల్ శర్మ చేయబోతున్నారు.
దాదాపు 20 మందిని ప్రేమ ప్రేరుతో ట్రాప్ చేసి ఆ తరువాత అత్యంత దారుణంగా అనుభవించి సైనైడ్‌తో హత్య చేసిన వ్యక్తి సైనైడ్ మోహన్. ఈ కేసులో అతనికి 14 ఏళ్ల యావజ్జీవ కారాగార శిక్షతో పాటు మరణించే వరకు 6 సార్లు ఉరిశిక్ష విధించాలని కోర్టు సంచలన తీర్పు చెప్పింది. దీంతో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదే కథ ఆధారంగా తెరకెక్కనున్న `సైనైడ్` చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ తో మొదలుపెట్టబోతున్నామని , బెంగళూరు, మంగళూరు, కూర్గ్, మడిక్కెరి, గోవా, హైదరాబాద్, కాసరగోడ్ వంటి కీలక ప్రదేశాల్లో ఈ మూవీ షూటింగ్ చేయనున్నామని నిర్మాత తెలిపారు.