
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు స్టార్ హీరోలకు షాక్ ఇస్తూ వరుసగా భారీ ప్రాజెక్ట్‌లని ప్రకటించారు. `రాధేశ్యామ్` చిత్రంలో నటిస్తూనే `ఆది పురుష్`. సలార్ చిత్రాలతో పాటు నాగ్ అశ్విన్ తో ఓ భారీ చిత్రాన్ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో `రాధేశ్యామ్` మూవీ షూటింగ్‌ని పూర్తి చేసిన ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్ చిత్రాల్లో నటిస్తే బిజీగా వున్నారు.
ఇదిలా వుంటే ఓం రౌత్ తెరకెక్కిస్తున్న `ఆది పురుష్` షూటింగ్ ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో వరుస కథనాలు వినిపిస్తున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా `ఆది పురుష్` షూటింగ్ ఆగిపోయిందంటూ పుకార్లు మొదలయ్యాయి. అయితే ఈ పుకార్లపై దర్శకుడు ఓం రౌత్ స్పందించారు. `ఆది పురుష్` షూటింగ్ ఆగలేదని, ఎలాంటి అవాంతరం జరగలేదని స్పష్టం చేశారు.
ఇక యూనిట్ సభ్యుల్లో ఒకరికి కోవిడ్ సోకినట్టుగా వస్తున్న వార్తల్లోనూ ఎలాంటి వాస్తవం లేదని వెల్లడించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేస్తున్నామని, సెట్‌లో ఏ ఒక్కరు కూడా కోవిడ్ బారిన పడలేదని క్లారిటీ ఇచ్చారు. రామాయణ ఇతిమాసం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. 3డీ ఫార్మాట్‌లో అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీ రూపొందుతోంది.