
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫార్మల్ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడమే తరువాయి. అయితే తాజాగా ఈ సినిమా ఆగిపోయిందని, అనవార్య కారణాల వల్లే సదరు హీరో, దర్శకుడు ఓ నిర్ణయానికి వచ్చి ఆపేశారంటూ కథనాలు మొదలయ్యాయి.
అయితే ఈ కథనంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ సెటైరికల్‌గా స్పందించయారు. సోషల్ మీడియా వేదికగా ఈ వార్తపై `గుడ్ జోక్` అంటూ నవ్వుతున్న ఎమోజీలని పోస్ట్ చేశారు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందన్నది ఫేక్ న్యూస్ అని స్పష్టమైంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ కోవిడ్ బారిన పడటంతో ఈ షెడ్యూల్ మారే అవకాశం వుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ ఘట్టాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. అత్యంత భారీ స్థాయిలో రోమాంచిత సన్నివేశాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విజయదశమి సందర్భంగా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే.