
ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను శోకసంద్రంలో పడేసింది. గౌతమ్ రెడ్డి మరణం వైసీపీ పార్టీకి పెద్ద లోటుగా అంత మాట్లాడుకుంటున్నారు. ఓ పెద్ద హోదాలో ఉన్నప్పటికీ గౌతమ్ కు కులాల కుమ్ములాటలు, కక్షా రాజకీయాలు వంటివి తెలియవు. తన పనేంటో తాను ఏంటో అన్నట్లు వ్యవహరిస్తుంటారు.
రాజమోహన్‌రెడ్డికి ముగ్గురు కుమారులు. వీరిలో గౌతమ్‌రెడ్డి ఒక్కరే రాజకీయాల్లోకి వచ్చారు. 1971 నవంబర్2న జన్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి.. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడేళ్ల క్రితం తొలిసారి మంత్రి అయినా, ఇప్పటికీ రాజకీయాలు చేయడం తెలియని నేత గౌతం రెడ్డి. అన్నింటికంటే ముఖ్యంగా తనపై సీఎం జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వైసీపీ సర్కార్ కు భవిష్యత్ ఆశాకిరణంగా పేరు తెచ్చుకున్నారు.
జగన్ కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో అందరి కంటే ఎక్కువ విద్యావంతుడిగా, సమర్దుడిగా, నిబద్ధత కలిగిన మంత్రిగా మేకపాటి గౌతం రెడ్డి తెచ్చుకున్న పేరు ప్రత్యేకం. ఐటీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి మంత్రిగా నియమించి సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌతం రెడ్డి నిరంతరం శ్రమించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా తన ఆఖరి క్షణాల వరకు ఏపీ అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి కల్పన అంశాలపైనే ఆయన ఫోకస్ పెట్టారు. పది రోజుల పాటు విదేశాల్లోనే మకాం వేసి భారీ ఎత్తున పెట్టుబడులు ఏపీకి తీసుకువచ్చారు. చనిపోవడానికి ఒక్క రోజు ముందు వరకు మేకపాటి గౌతంరెడ్డి ఏపీ అభివృద్ధి కోసమే శ్రమించారు. ఐటీ పరిశ్రమల మంత్రి హోదాలో చివరగా దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. 2022 ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 17వ తేదీ దుబాయ్ ఎక్స్‌పోలో నిర్వహించిన ఏపీ పెవిలియన్‌ను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఎంతో పారిశ్రామికవేత్తలు, ఎంట్రప్యూనర్లతో వారం రోజుల పాటు అలుపెరగకుండా చర్చలు జరిపారు. అంతేకాదు అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్ రోడ్‌షోలో ఆయన స్వయంగా పాల్గొని ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. గౌతమ్ రెడ్డి శ్రమ ఫలించి ఏపీలో భారీ పెట్టుబడులకు అనేక కంపెనీలు ఆమోదం తెలిపాయి.
మొత్తం 11 సెక్టార్లలో 70 ప్రాజెక్టులకు గ్రీన్ పెట్టుబడి అవకాశాలను దుబాయ్ ఎక్స్‌పోలో గౌతమ్ రెడ్డి సాధించారు. రూ. 5,150 కోట్ల పెట్టుబడులకు ఆరు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దుబాయ్ ఎక్స్‌పోలో కుదిరిన ఒప్పందాల్లో రీజెన్సీ గ్రూపు హైపర్ రిటైల్, ఫుడ్ ప్రోసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు అంగీకారం తెలిపింది. అల్యూమినియం కాయిల్స్, ప్యానల్స్ తయారీకి మల్క్ హోల్డింగ్స్ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు షరాఫ్ గ్రూపు, శీతలీకరణ మౌలిక వసతులు కల్పించే తబ్రీద్, ఎలక్ట్రికల్ బస్సుల తయారీకి కాసిస్ ఈ-మొబిలిటీ, స్మార్ట్ సిటీ యుటిలీటీకి సంబంధించి ఫ్లూయంట్ గ్రిడ్ సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. ఇలా ఆఖరి క్షణం వరకు రాష్ట్రం కోసం పనిచేసి..అందరి చేత శభాష్ అనిపించుకున్నారు గౌతమ్ రెడ్డి.