
ఏదైనా విపత్తు వచ్చినా, సమాజంలో కష్టం ఎదురైనా కానీ సాయం అందించడానికి సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ ముందుంటుంది. గతంలో మేము సైతం కార్యక్రమాలు వంటివి ఎన్నో చేసిన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈసారి కూడా ముందుకు వచ్చింది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ జనాలు ఎవరినీ తమ తమ ఇళ్ల నుండి బయటకు రావొద్దని చెప్పారు. అలాగే సాయంత్రం 5 గంటలకు బాల్కనీ వద్ద కానీ, కిటికి నుండి కానీ లేదా మేడ మీద నుండి కానీ ఈ కరోనా మహమ్మారిను తరిమికొట్టేందుకు కష్టపడుతున్న డాక్టర్లు, నర్స్ లు, ఇంకా మిగతా మెడికల్ సిబ్బందికి, పోలీసులకు, మున్సిపాలిటీ వారికి సంఘీభావం తెలిపేందుకు ఏదైనా చప్పుడు కరతాళ ధ్వనులు వంటివి చేయాలనీ పిలుపునిచ్చారు.
14 గంటలు ఇంటిలో ఉండడం అంటే కొంచెం కష్టమైన వ్యవహారమే. అందుకే సినిమా ఇండస్ట్రీ ప్రజలను ఈ కష్ట సమయంలో సహాయం చేయడానికి ముందుకొచ్చింది. 14 గంటల పాటు ప్రజలను ఎంటర్టైన్ చేయాలని నిర్ణయించుకుంది. 14 గంటల పాటు 28 మంది నటీనటులు ఉదయం 7 నుండి మొదలుపెట్టి రాత్రి 9 వరకు నాన్ స్టాప్ గా అలరించనున్నారు. ఉదయం 7 గంటలకు లక్ష్మి మంచు ఇన్స్టాగ్రామ్ లైవ్ లో సందడి చేసింది. తన తర్వాత వరసగా నవదీప్, కాజల్ అగర్వాల్, ఈషా రెబ్బ, రాజ్ తరుణ్, రకుల్ ప్రీత్, మంచు మనోజ్ ఇలా అరగంటకు ఒకరి చొప్పున ఇన్స్టాగ్రామ్ లో లైవ్ కు వస్తారు. చివరికి 9 గంటలకు రానా దగ్గుబాటి లైవ్ తో ముగుస్తుంది.
ఈ అరగంట పాటు ఇన్స్టాగ్రామ్ లో తమ తమ అభిమానులతో ఈ నటీనటులు తమ అనుభవాలను పంచుకుంటారు, ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు. అలాగే కరోనాను ఎదుర్కొనేందుకు సలహాలు కూడా ఇస్తారు. మరి ఈ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో ఎవరు ఏ ఏ విశేషాలు పంచుకుంటారో చూడాలి.