Homeన్యూస్కాదంబరి ఆశ, శ్వాస మనం సైతం...

కాదంబరి ఆశ, శ్వాస మనం సైతం…

Manam Saitham Kadambari Press Meetసాటి వారికి సేవ చేసే మనిషిలోనే దైవం ఉన్నాడని మనం సైతం సేవా కార్యక్రమాల ద్వారా కాదంబరి కిరణ్ నిరూపిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ లక్షలాది సైన్యంగా ఎదుగుతోంది. వందల మంది పేదలు ఆదుకోవాలంటూ ఈ సేవా సంస్థను ఆశ్రయిస్తున్నారు. మనం సైతం దగ్గరకు వచ్చే ఆర్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా మరికొందరు పేదలకు మనం సైతం ఆర్థిక సహాయాన్ని అందించింది. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి జయలలిత, బిగ్ బాస్ విజేత కౌశల్, బుల్లితెర నటుడు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మణికంఠ, పి. రంగాచార్యులు, లక్కీ యాదవ్, గుమ్మోజి భరత్ కుమార్, అంజనాదేవి, టీఎన్వీ గాయత్రి, ఝాన్సీ, భాస్కర్, దిలీప్ తేజ లకు చెక్ లను అతిథుల చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న నటి జయలలిత లక్ష రూపాయలు, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరుపున ప్రెసిడెంట్ స్వామి గౌడ్, అనిల్, రవి లక్ష రూపాయలు, నిర్మాత బన్నీవాస్ 75 వేల రూపాయలు, కౌశల్ 25 వేల రూపాయల విరాళం ప్రకటించగా…దర్శకుడు పూరీ జగన్నాథ్ మనం సైతంకు ఒక ప్రత్యేకమైన యాప్ తయారు చేసి ఇస్తానని చెప్పారు.

ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ….మన సైతం కార్యక్రమానికి రమ్మని పరిశ్రమకు చెందిన పెద్దలను అడుగుతున్నాను. ఇలా రమ్మనేది సంస్థకు డబ్బులు ఇవ్వమని కాదు. మీలాంటి పెద్దలు వస్తే మరింత మందికి మనం సైతం చేరువవుతుంది. అలా ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలుగుతాం. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా 90 మంది పేదలకు ఆర్థిక సహాయం అందించాం. వివిధ ఆస్పత్రుల వైద్యులను అభ్యర్థించి పేదలకు 43 లక్షల రూపాయల ఫీజులు తగ్గించాం. ఈ మధ్య ఓ డాన్సర్ కూతురుకి కేన్సర్ చికిత్స కోసం మన వంతు సహాయం చేస్తూనే ఎంపీ జోగినపల్లి సంతోష్ గారిని అడిగి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 3 లక్షల 75 వేల రూపాయలు సహాయం ఇప్పించాను. ఇవాళ మనం సైతం లక్షా 65 వేల మంది సభ్యుల సేవా బృందం. పేదవాడి గురించి బతికున్నంత కాలం పరుగెత్తుతూనే ఉంటాను. అన్నారు.

- Advertisement -

జయలలిత మాట్లాడుతూ….ఇక్కడికొచ్చి కార్యక్రమం చూస్తుంటే దైవం మానవ రూపంలో ఉంటాడనే మాట గుర్తుకువస్తోంది. దేవుడు అన్నిచోట్లకు రాలేడు. తనకు బదులుగా కొందరు మనుషులను పెడతాడు. అలా దేవుడు తన రూపంలో అందించిన మనిషే కాదంబరి కిరణ్. ఆయన మనం సైతం ద్వారా పేదల ఆరోగ్యం, విద్య, వృద్ధులకు సహాయపడుతున్నారు. నా వంతుగా లక్ష రూపాయలు విరాళం ఇస్తున్నాను. నాకు తెలిసిన విదేశీ మిత్రులకు మనం సైతం గురించి చెప్పి వారి దగ్గర నుంచి సాధ్యమైనంత విరాళాలు సేకరిస్తాను. ఎప్పుడూ సరదాగా ఉండే కాదంబరిలో ఇంత గొప్ప సేవాతత్వం ఉందని తెలిసి ఆశ్చర్యంగా ఉంది. అని అన్నారు.

బిగ్ బాస్ విజేత కౌశల్ మాట్లాడుతూ…మనం సైతంలో నేను సభ్యుడిని అవడం, కాదంబరి అన్నకు తమ్ముడు అవడం అదృష్టంగా భావిస్తున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తర్వాత నాకు మరో అమ్మ మనం సైతం. కౌశల్ ఆర్మీని ఎలా నడిపించాలి అని ఆలోచిస్తున్న సమయంలో కాదంబరి గారు మనం సైతం ద్వారా నా అభిమానులకు దారి చూపించారు. మనం సైతం స్ఫూర్తితో కౌశల్ ఆర్మీ కూడా పనిచేస్తుంది. ఈ సేవా సంస్థకు అండగా నిలబడుతుంది. నా వంతుగా పాతిక వేల రూపాయలు విరాళం ఇస్తున్నాను. అన్నారు.

దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ….కాదంబరి కిరణ్ అన్నయ్యతో నాకున్న స్నేహం వయసు 30 ఏళ్లు. నేను సహాయ దర్శకుడిగా పని దొరక్క ఇబ్బంది పడుతున్న సమయంలో ఏదో ఒక పని చెప్పి వెయ్యి, రెండు వేలు చేతిలో పెడుతుండేవారు. ఏదైనా పని ఉందా అన్నా అని అడిగితే దూరదర్శన్ కార్యక్రమాలో ఏవో ఒకటి ఇస్తుండేవాడు. సేవా దృక్పథం అనేది కాదంబరి అన్న రక్తంలోనే ఉంది. ఇక్కడికొచ్చాకే ఆయన ఎంత పెద్ద సేవా కార్యక్రమం చేస్తున్నాడో అర్థమయ్యింది. దేవుడు మనకు సాయం చేసినా చేయకున్నా మనకు అండగా ఉండేది సాటి మనిషే అని నేను నమ్ముతాను. అలాంటి సాయం చేసే మనిషి కాదంబరి. ఆయన మీద పరిశ్రమలో ఉన్న మంచి పేరు వల్లే మనం సైతం ఇంత బాగా ముందుకెళుతోంది. మనందరం కలిసి ఈ సేవా సంస్థను మరింత అభివృద్ధి చేయాలి. ఇందుకు ఒక యాప్ రూపొందించాలి అనుకుంటున్నాను. అన్నారు.

ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, మనం సైతం ఉపాధ్యక్షుడు బందరు బాబీ మాట్లాడుతూ…కాదంబరి అన్న ఎంతో మంది పేదలను ఆదుకుంటున్నారు. ఆయన చేస్తున్న ఈ కార్యక్రమంలో చివరిదాకా తోడుగా ఉంటాం. పూరీ గారు మా కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. అన్నారు.

ఈ కార్యక్రమంలో మనం సైతం సభ్యులు సురేష్, వర్మ, అనిల్ కుమార్, వినోద్ బాలా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All