
కరోనా వైరస్ ప్రబలడంతో అందరి ప్లాన్స్ మారి పోయాయి. ముందు ఎన్నో ప్లాన్ చేసుకున్న వాళ్లంతా వైరస్ ప్రభావంతో తమప్లాన్‌ని మార్చేసుకున్నారు. అలాగే సూపర్‌స్టార్ మహేష్ తన ప్లాన్‌ని కూడా పూర్తి మార్చేసుకున్నారని ప్రచారం జరిగింది. కానీ ఆయన తన ప్లాన్ మార్చుకోలేదని, అంతకు ముందు అనుకున్న ప్రకారమే షూటింగ్ కు సిద్ధం అవుతున్నారని తెలిసింది. మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. యంగ్ డైరెక్టర్ పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ పై వ్యంగ్యాస్త్రంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. వేల కోట్లు బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఓ వైట్ కాలర్ నేరగాడిని హీరో ఎలా తిరిగి ఇండియాకు తీసుకొచ్చాడనే పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కథ డిమాండ్ మేరకు ఈ చిత్ర కీలక షెడ్యూల్‌ని అమెరికాలో షూట్ చేయాలని ప్లాన్ చేశారు. కరోనా వైరస్ కారణంగా ఆ ప్లాన్ మారిందని ప్రచారం జరిగింది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఆ ప్లాన్ మారలేదని తెలిసింది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ని ప్రారంభించి అమెరికాకు చిత్ర బృందం వెళ్లాలనుకుంటోందట. అక్కడ 30 రోజుల పాటు కీలక సన్నివేశాల్ని వాషింగ్టన్ డీసీలో షూటింగ్ చేసి చిత్ర బృందం దసరాకు ఇండియాకు తిరిగి రానుందని చెబుతున్నారు. ఇందులో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటించనుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.