
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా పాకుతోంది. ఏ దేశాన్నీ విడిచి పెట్టడం లేదు. వరుసగా చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలన్నీ చుట్టేస్తోంది. చైనాలో పుట్టి పుహాన్ నగరం నుంచి విళయతాండవం చేస్తున్న కరోనా వైరస్ మెల్ల మెల్లగా ప్రపంచం మొత్తం పాకేస్తోంది. దీన్ని అరికట్టాలంటే నివారణ ఒక్కటేమార్గమని, దీనికి ప్రజల్లో అవగాహన కల్పించడం తప్ప మరో మార్గం లేదని దేశాధినేతలు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.
తాజాగా రాష్ట్రాలని అప్రమత్తం చేయడంతో రాష్ట్రాలన్నీ రెండు వారాల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో పాటు సినిమా థియేటర్లు, జనసమూహాలు ఎక్కువగా వుండే మ్యూజియంమ్స్‌ని, పార్కులని మూసి వేయించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. సినిమా హీరోలు కూడా తమ వంతు బాధ్యతగా ప్రజల్ని చైతన్యవంతులని చేయడం కోసం సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవల చిరంజీవి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ మీడియా ద్వారా ప్రకటనలు చేశారు. తాజాగా మహేష్ బాబు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకొచ్చారు.
సామిజికంగా దూరం వుండటం చాలా అవసరం. ఇది చాలా కఠినమైన సమయమే అయినా అంతా పాటించక తప్పదు. మన సామాజిక జీవితాన్ని త్యాగం చేయడానికి మరియు ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇదే సమయం. వీలైనంత వరకు ఇంట్లోనే వుండటానికి ప్రయత్నించండి. మీ కుటుంబంతో, మీకు చాలా ప్రియమైన వారితోనే ఎక్కువ సమాయాన్ని గడపటానికి ప్రాధాన్యతనివ్వండి. ఇది వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. చాలా మంది ప్రాణాలని కాపాడుతుంది. మీరు తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోండి. మీ చుట్టూ వున్న వాతావరణాన్ని పరిశుభ్రంగా వుండేలా చూసుకోండి. వీలైనంత వరకు హ్యాండ్ సానిటైజర్లని ఉపయోగించండి. మీరు అనారోగ్యంతో వున్నారనుకుంటే మత్రమే మాస్కులు వాడండి. ఈ విపత్తు గడిచే వరకు అన్నీ అనుసరిద్దాం. అంతా కలిసి కరోనాని ఓడిద్దాం` అని మహేష్ పోస్ట్ చేశారు.