
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ గత కొంత కాలంగా ట్విట్టర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసి దేశ వ్యాప్తంగా కంగన హాట్ టాపిక్‌గా మారింది. ఆ తరువాత స్వయంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేని టార్గెట్ చేస్తూ కంగన `నీ అహంకారపు కోట కూలుతుంది` అంటూ విడుదల చేసిన వీడియో రాజకీయ ప్రకంపణలు సృష్టించింది.
ఆమె మాటలు, పరుష పదాలు హద్దులు దాటుతుండటంతో సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్ తాజాగా మరో సారి కంగన ట్విట్టర్ ఖాతాని శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించి షాకిచ్చింది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలని పోస్ట్ చేస్తూ వాటి ద్వారా ట్విట్టర్ నియమ నిబంధనలను కంగన ఉల్లంఘించారని పేర్కొంది. విద్వేషపూరిత, అసభ్య ప్రవర్తన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ట్విట్టర్ యాజమాన్యం వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్లో ఇటీవల హోరా హోరీగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం కంగన చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కించపరుస్తూ కంగన ట్వీట్ చేయడం విమర్శలకు దారితీసింది. ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్‌లో హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం వుందని జర్నలిస్ట్, రాజకీయ నాయకురాలు స్వపన్ దాస్ గుప్త చేసిన ట్వీటకు కంగన వివాదాస్పదంగా బదులివ్వడంతో ఆమె ట్విట్టర్ ఖాతాని శాశ్వతంగా తొలగిస్తున్నట్టు ట్విట్టర్ అధికార ప్రతినధి వెల్లడించారు.