
వివాదాలతో కెరీర్‌ని నెట్టుకొస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తాజాగా హైకోర్టు మొట్టికాయలు వేసింది. తాజాగా ఆయనకు హైకోర్టు షోకాజ్ పోటీసులు జారీ చేసింది. షాద్‌నగర్ సమీపంలో జరిగిన హృదయవిదారక సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని రామ్ గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం `దిశ ఎన్‌కౌంటర్`.
ఈ చిత్రాన్ని నిలిపివేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. వర్మ రూపొందిస్తున్న `దిశ ఎన్ కౌంటర్` చిత్ర విడుదలను నిలిపివేయాలంటూ దిశ హంతకుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌లో తమ కుమారుల్ని కోల్పోయి బాధలో వున్న నా క్లైంట్ లను సినిమా అంటూ మనోవేదనకు గురి చేస్తున్నారని లాయర్ కృష్ణమూర్తి కోర్టుకు వివరించారు.
దీంతో హైకోర్టు వర్మకు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే జుడిషియల్ ఎంక్వైరీ కొనసాగుతున్న కేసు ఆధారంగా సినిమా ఎలా తీస్తారని హైకోర్టు ధర్మాసనం వర్మపై మండిపడింది. ఈ నెల 26న `దిశ ఎన్‌కౌంటర్` చిత్రాన్ని విడుదల చేయాలని వర్మ అండ్ కో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్‌కు హైకోర్టు బ్రేకులు వేయడంతో వర్మ ఎలా స్పందిస్తారా? అని అంతా ఎదురుచూస్తున్నారు.