
దర్శకుడిగా కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలు తీసే హరీష్ శంకర్ కు మాస్ పల్స్ బాగా తెలుసనే పేరుంది. ఒకట్రెండు సార్లు అది ఫెయిల్ అయినా కానీ హరీష్ శంకర్ తాజాగా తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ చిత్ర విజయంతో దాన్ని మరోసారి నిరూపించాడు. ఈ చిత్రం విజయం సంగతి పక్కనపెడితే హరీష్ శంకర్ ప్రవర్తనలో మార్పు మీడియా వారికి స్పష్టంగా తెలుస్తోంది.
యావరేజ్ సినిమా తీసినా హరీష్ శంకర్ చేసే హడావిడి మాములుగా ఉండదు. డీజే సినిమా టైంలో అయితే హరీష్ శంకర్ మీడియా మీద వేసిన సెటైర్లు అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. అయితే ఈసారి గద్దలకొండ గణేష్ విషయంలో హరీష్ శంకర్ లో మార్పు తెలుస్తోంది. ఈ చిత్రం విజయం సాధించినా ఎక్కడా హరీష్ శంకర్ హడావిడి చెయ్యట్లేదు. చాలా గౌరవంగా ఈ విజయాన్ని స్వీకరిస్తున్నాడు.
కారణాలు ఏమైనా డీజే తర్వాత హరీష్ శంకర్ కెరీర్ లో బాగా గ్యాప్ వచ్చింది. అయితే ఈసారి హరీష్ సినిమా త్వరగా పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. తను ఎంతో ఇష్టపడి రాసుకున్న దాగుడుమూతలు కథ కోసం ఇద్దరు హీరోలను ఎప్పటినుండో అన్వేషిస్తున్న హరీష్ కు వారు త్వరలోనే దొరికే అవకాశముంది. మరి చూద్దాం హరీష్ ఈసారైనా దాగుడుమూతలు తీస్తాడో లేక వేరే సినిమాకి కమిట్ అవుతాడో.