
కమర్షియల్ డైరెక్టర్ గా పేరొందిన హరీష్ శంకర్ డైరెక్టర్ గా పడుతూ లేస్తూ సాగుతున్నాడు. కెరీర్ మొదటి చిత్రమైన షాక్ అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఈ తర్వాత మిరపకాయ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. దాని తర్వాత గబ్బర్ సింగ్ అంటూ కెరీర్ బెస్ట్ హిట్ కొట్టాడు. పవన్ కళ్యాణ్ కు చాలా ప్లాప్స్ తర్వాత వచ్చిన హిట్ అది.
దాని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన రామయ్య వస్తావయ్యా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత హరీష్ మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకుని సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాతో హిట్ కొట్టాడు. ఆ వెంటనే అల్లు అర్జున్ డీజే తో అవకాశం ఇచ్చినా దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు.
డీజే తర్వాత సినిమా ఓకే అవ్వడానికే హరీష్ కు ఏడాదికి పైగా పట్టింది. అయితే ఎట్టకేలకు జిగర్తాండ రీమేక్ తో వాల్మీకి సినిమాను తీసాడు. ఒరిజినల్ వెర్షన్ కు తనదైన శైలిలో మార్పులు చేసి, అదనపు హంగులు జోడించి తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దాడు. వాల్మీకి ఇప్పుడు గద్దలకొండ గణేష్ గా మారింది. కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. లాభాల్లోకి మరికొన్ని రోజుల్లో రానుంది. మరి మళ్ళీ హిట్ కొట్టిన హరీష్ అలసత్వం ప్రదర్శించి అలవాటు ప్రకారం ప్లాప్ అందుకుంటాడా లేక పట్టుదలగా ప్రయత్నించి హిట్టు కొడతాడా అన్నది చూడాలి.