
ఒక హీరోతో చేయాలనుకున్న సినిమాలు మరో హీరోతో చేసినవి చాలానే వున్నాయి. `షోలే` చిత్రాన్ని ముందు శత్రఘ్న సిన్హాతో చేయాల్సింది. ఆ సమయంలో ఆయన వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుండటం వల్ల రమేష్ సిప్పీ ఆ కథని అమితాబ్ బచ్చన్ దగ్గరికి తీసుకెళ్లారు. అలా అమితాబ్ `షోలే` సినిమాతో సూపర్‌స్టార్ అయ్యారు. తెలుగులో `ఖైదీ` చిత్రాన్ని సూపర్‌స్టార్ కృష్ణ చేయాల్సింది. `ఖైదీ` కథని దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి హీరో కృష్ణకు వినిపిస్తే ఛాతిపై కోయడం లాంటి సన్నివేశాలు చేయను కొత్తగా వచ్చాడు చిరంజీవి అని అతనితో అయితే బాగుంటుంది అన్నారట. దాంతో `ఖైదీ` అనుకోకుండా చిరుకి దక్కింది. ఆయనను టాలీవుడ్ కు మెగాస్టార్‌ని చేసింది.
ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒక హీరో చేయాల్సిన సినిమాల్ని మరో హీరో దక్కించుకుని సూపర్‌స్టార్‌లుగా పేరు తెచ్చకున్న వాళ్లు చాలా మందే వున్నారు. ఇదే తరహాలో ఓ సినిమా రజనీకాంత్ వద్దకు వచ్చింది. విజయ్ హీరోగా గౌతమ్ మీనన్ గత కొన్నేళ్ల క్రితం మొదలుపెట్టి మధ్యలోనే ఆపేసిన చిత్రం `యోహన్ అధ్యాయం ఒండ్రు`. ఫొటో షూట్ పూర్తయిన తరువాత హీరో విజయ్, దర్శకుడు గౌతమ్ మీనన్‌ల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ చిత్రాన్ని విజయ్ మధ్యలోనే వదిలేశాడు.
ఇప్పుడు ఇదే చిత్రాన్ని రజనీకాంత్‌తో చేయాలని గౌతమ్ మీనన్ ప్రయత్నాలు మొదలుపెట్టాడని తెలిసింది. గత కొంత కాలంగా యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్న రజనీకాంత్ ఈ చిత్ర కథని వినబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ రిజెక్ట్ చేసిన తరువాత ఇదే కథని దర్శకుడు గౌతమ్ మీనన్ హీరో సూర్యకు, విక్రమ్‌కు వినిపించారట. దాంతో ఈ సినిమా కథని పక్కన పెట్టిన గౌతమ్ మీనన్ మళ్లీ కొత్త ఆశలు చిగురించడంతో రజనీతో అయితే బాగుంటుందని భావించి ఆయన కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు చెన్నై వర్గాల కథనం. ఇది ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందో చూడాలి.