
రజనీ అంటే ఓ స్టైల్… మేనరిజమ్స్‌కి ఓ మాస్టర్. ఆయన తెరపై కనిపిస్తే మెరుపులే.. ఆయన నడకే ఓ స్టైల్… భారతీయ సినిమాల్లో హీరో పాత్రలకు స్టైల్ ని ఆపాదించడంలో తలైవర్ రజనీకాంత్ ది ప్రత్యేక శైలి. ఆ శైలిని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పటికి భారతీయ సినిమాల్లోకి ఎంతో మంది రంగ ప్రవేశం చేశారే కానీ రజనీని మాత్రం మరిపించడం కాదుకదా స్టైల్ పరంగా, మేనరిజమ్స్ పరంగా ఆయన దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారంటే రజనీ స్టైల్ కున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా 44 ఏళ్ల క్రితం రజనీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తన స్టైల్స్‌తో, మేనరిజమ్స్‌తో ఆకట్టుకుని సూపర్‌స్టార్‌గా ఎదిగారు.
బస్‌లో వెళుతుండగా రజనీ స్టైల్‌ని గమనించి ద్శకుడు బాల చందర్ ఆయనని నటుడిని చేస్తానని మాటిచ్చారు. ఆ మాట ప్రకారం శివాజీరావు గైక్వాడ్‌గా వున్న ఆయనని తమిళ తెరకు `అపూర్వ రాగంగల్` సినిమాతో రజనీకాంత్‌గా పరిచయం చేశారు. ఇందులో ఆయన నటన చూసిన వారంతా ఇతడెవరో కొత్తగా వున్నాడే అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి రజనీ నట ప్రస్థానం మొదలైంది. ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో బాలచందర్ తెరకెక్కించిన `అంతులేని కథ` రజనీకి రెండు భాషల్లోనూ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. 1978లో వచ్చిన `భైరవి` రజనీకాంత్‌ని సూపర్‌స్టార్‌ని చేసింది. ఆ సినిమాలో రజనీ స్టైల్, మేనరిజమ్స్ ఆనాటి యువతని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తరువాత నుంచే రజనీ తమిళ ప్రేక్షకులకు డెమీ గాడ్‌గా మారారు.
1980లో వచ్చిన `బిల్లా` సినిమాతో మాస్‌కి మరింత చేరువైన రజనీని బాషా, ముత్తు, అరుణాచలం చిత్రాలు హీరోగా ఆయన కెరీర్‌నే మలుపు తిప్పాయి. స్టార్ హీరోగా తిరుగులేని కీర్తిని సొంతం చేసుకునేలా చేశాయి. ఎంత ఎదిగినా ఒదిగి వుండే లక్షణమే ఆయనని ఈ స్థాయికి చేర్చిందని రజనీ సన్నిహితులు చెబుతుంటారు. `బాబా` సినిమాకు ముందు నుంచే ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ ప్రతి సంవత్సం హిమాలయాలకు వెళ్లివస్తున్నారాయన. ఇప్పటికే ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే వున్నారు. 167 చిత్రాల్లో నటించిన రజనీలో ఇప్పటికీ అదే మెరుపు వేగం. అదే స్పార్క్ తొణికిసలాడుతోంది. స్టార్ హీరోగా ఎత్తుపల్లాలు చూసిన రజనీ ఎంత స్టార్ హీరో అయినా ఇప్పటికీ నిరాడంబరంగానే వుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న రజనీ పుట్టిన రోజు నేడు. 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆయన ఇదే జోష్‌తో..అదేస్టైల్‌ని మెయింటైన్ చేస్తూ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని, ఇలాగే తన అభిమానుల్ని ఎంటర్‌టైన్ చేయాలని ఆశిద్దాం.