
హీరో. డా. రాజశేఖర్ కరోనాని జయించారు. గత నెల రోజులుగా బంజారా హిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజశేఖర్ కరోనా మహమ్మారి నుంచి బయటపడటంతో వైద్యులు ఆయనని సోమవారం డిశ్చార్జ్ చేశారు. ఇంటికివెళ్లే ముందు ఆస్పత్రి సిబ్బందితో ఫొటో దిగిన ఆయన సిబ్బందికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా క్లిష్ట పరిస్థితుల్లో తన భర్తను ప్రాణాపాయం నుంచి కాపాడిన సీఎన్ సీ వైద్య బృందానికి జీవిత రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. నెల రోజుల పాటు ఆస్పత్రి సిబ్బంది తమను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని తెలిపిన జీవిత రాజశేఖర్.. అభిమానులు, కుటుంబ సన్నిహితుల ప్రార్థనలు ఫలించి రాజశేఖర్ కోలుకున్నారని జీవిత సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కరోనాతో తీవ్రంగా పోరాడుతున్న ఆయన తాజాగా కోలుకున్నారు. ఒక దశలో ఆయన ఆరోగ్యం క్షీణించిందని, వెంటలేటర్‌పై వున్నారంటూ వదంతులు వ్యాపించాయి. దీనికి తోడు ఆయన చిన్న కుమార్తె సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ మరింత గందరళానికి గురిచేసింది. నాన్న తీవ్రంగా కరోనాతో పోరాడుతున్నారని, ఆయన ఆరోగ్యం కుదుటపడాలని అంతా ప్రార్థించండని శివాత్మక ట్వీట్ చేయడంతో అంతా అపార్థం చేసుకున్నారు. విషయం గ్రహించిన జీవిత పూకార్లపై స్పసందించి ప్రమాదం ఏమీ లేదని, రాజశేఖర్ కోలుకుంటున్నారని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.